కేఎల్‌ఐ కింద కొత్త ఆయకట్టుకలేనా ?
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:29 PM
అనేక అభ్యంతరాలు, అడుగడుగునా అవాంతరాలు, నిధుల లేమి మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని (ఎంజీకేఎల్‌ఐ) నిర్వీర్యం చేస్తోంది.

- 13 ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో నీరందని పరిస్థితి
- సర్వే దశలోనే కొత్త రిజర్వాయర్లు
- చివరి ఆయకట్టుకు నీరందక అన్నదాతల ఆవేదన
నాగర్‌కర్నూల్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : అనేక అభ్యంతరాలు, అడుగడుగునా అవాంతరాలు, నిధుల లేమి మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని (ఎంజీకేఎల్‌ఐ) నిర్వీర్యం చేస్తోంది. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద పథకం ప్రారంభమై దాదాపు 13 ఏళ్లు కావస్తున్నా చివరి ఆయ కట్టు వరకు సాగునీరందకపోగా కొత్త ఆయకట్టు స్థిరీక రణ జరగకపోవడం మెట్ట రైతులను నిరాశకు గురి చేస్తోంది. 1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో పథకానికి అంకురార్పణ జరి గింది. పరిమితమైన బడ్జెట్‌తో పనులు ప్రారంభమైనా ఆ తర్వాత ఊపందుకున్నాయి. రెండు లక్షల 40 వేల ఎకరాలకు సాగునీరందించాలనే సంకల్పంతో చేపట్టా రు. నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, జడ్చర్ల, అచ్చంపేట ప్రాంతాలకు సాగునీరు అందించాలని డిమాండ్ రావడంతో క్రమంగా ప్రాజెక్టు ప్రాధాన్యతలు మారుతూ వచ్చాయి. ఈ క్రమంలో 4.51 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యాన్ని నిర్దేశించగా ఆచరణలో మాత్రం అమలు కావడంలేదు.
కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలేనా ?
కేఎల్‌ఐ కింద కొత్త ఆయకట్టును స్థిరీకరించి మెట్ట ప్రాంతాలకు సాగునీరందే అంశం ఈ ప్రాంత రైతుల కు కలగానే మిగిలిపోతుందా అనే సంశయం మొద లైంది. కల్వకుర్తి, అచ్చంపేట బ్రాంచ్ కెనాళ్ల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరందకపోగా కేవలం 540 చెరువులు, కుంటలను నింపి వాటి ద్వారానే ఆయకట్టుకు నీరందిస్తున్నారు.
ఆ 45 రిజర్వాయర్ల సంగతేంటి ?
4లక్షల 51 వేల ఎకరాలకు సాగునీరందించాలని రూపొందించిన ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టుకు కనీసం 45 టీఎంసీల నీరు అవసరమవుతుంది. కేవలం కృష్ణానది వరద జలాలపై ఆధారపడిన ఈ ప్రాజెక్టుకు నీటిని తోడుకునే సమయంలో నిల్వ చేసుకునే రిజర్వాయర్ల సామర్థ్యం లేదు. నార్లాపూర్, సింగవట్నం, జొన్నల బొగుడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లలో 3 టీఎంసీల లోపు నీటిని మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో కేఎల్‌ఐకి 17 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే విధంగా ప్యాకేజీ నెంబరు 28లో మూడు, 29లో 28, 30లో 14 రిజర్వాయర్లు నిర్మించాల ని వ్యాప్‌కో సంస్థ పదేండ్ల క్రితం చేసిన సర్వే కార్య రూపం దాల్చలేదు. ఇందుకు సంబంధించిన భూసేకర ణ అంశం కూడా కొలిక్కి రాకపోవడంతో మిగతా రైతుల్లో ఆందోళన నెలకొన్నది.