Share News

వయోవృద్ధులు 731 మందేనా..?

ABN , Publish Date - May 26 , 2025 | 11:41 PM

జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ద్వారా ప్రభుత్వం అందించే సీనియర్‌ సిటిజన్‌ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. 60 సంవత్సరాలు దాటిన వారికి ఈ కార్డు ఒక కల్పతరువులా పని చేస్తుంది.

వయోవృద్ధులు 731 మందేనా..?

- సీనియర్‌ సిటిజన్‌ కార్డుకు నోచుకోని వారు 17 వేల మందికి పైనే

- జిల్లాలో 18 వేల మందికి పైగా గుర్తింపు

- సరైన అవగాహన లేకపోవడంతో కార్డుకు దూరంగా..

- కార్డు పొందిన వారికి ఎంతో ఉపయోగం.. రాయితీలతో ప్రయోజనం

- 60 సంవత్సరాలు దాటిన వారికి ఈ కార్డు ఒక కల్పతరువు

- వయసు ధ్రువీకరణ పత్రాలతో ఒకే రోజులో కార్డు పొందే వెసులుబాటు

వనపర్తి జిల్లాలో వయోవృద్ధులు కేవలం 731 మంది మాత్రమే ఉన్నారా? ఔరా.. ఇదేమి విడ్డూరం. నమ్మశక్యం కాదు కదూ.. ఇదీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. సీనియర్‌ సిటిజన్‌ కార్డు ఒకటి ఉంటుందన్నది ఎవరికీ తెలుపుకపోవడం కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పువచ్చు. జిల్లా అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల జిల్లాలో 18 వేల మంది వయోవృద్ధులకు గాను కేవలం 731 మంది మాత్రమే ఈ కార్డును పొందడం గమనార్హం. ఈ ఏడాది కేవలం ఫిబ్రవరిలో ఒకే ఒక్క అవగాహన కార్యక్రమం నిర్వహించారంటే వారి పనితీరును ప్రశ్నిస్తోంది.

వనపర్తి టౌన్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ద్వారా ప్రభుత్వం అందించే సీనియర్‌ సిటిజన్‌ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. 60 సంవత్సరాలు దాటిన వారికి ఈ కార్డు ఒక కల్పతరువులా పని చేస్తుంది. సీనియర్‌ సిటిజన్‌ కార్డు చేతిలో ఉంటే దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ, ప్రభుత్వ ఆనుబంధ సంస్థల్లో సులభతరంగా సేవలను పొందవచ్చు. అంతేకాకుండా అనేక ప్రభుత్వ రాయితీలను సీనియర్‌ సిటిజన్స్‌ సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. కానీ సీనియర్‌ సిటిజన్‌ కార్డు అనేది ఒకటుంటుందనే విషయం గురించే క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రజలకు తెలియకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపిస్తోంది.

కనిపించని అవగాహన కార్యక్రమాలు...

జిల్లాలో 18 వేల మందికి పైగా సీనియర్‌ సిటిజన్స్‌ ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీరికి ప్రభుత్వం తరఫున అందించే సీనియర్‌ సిటిజన్‌ కార్డు కోసం నిత్యం గ్రామీణ స్థాయిలో గ్రామ సభలు ఏర్పాటు చేసి 60 సంవత్సరాలు దాటిన పురుషులు, 58 సంవత్సరాలు దాటిని మహిళలకు సీనియర్‌ సిటిజన్‌ కార్డును అందించాలి. కానీ జిల్లా అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల 18 వేల మంది వయోవృద్ధులకు గాను కేవలం 731 మంది మాత్రమే ఈ కార్డును పొందారు. ఈ ఏడాది కేవలం ఫిబ్రవరిలో ఒకే ఒక్క అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించారు. దాదాపు 17 వేల మందికి ఈ కార్డు గురించి సమాచారం తెలియకపోవడమో, లేక ఇతర వేరే కారణాలతోనో సీనియర్‌ సిటిజన్‌ కార్డు పొందలేకున్నారు. కార్డు కలిగినవారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందేందుకు వీలుంటుంది.

రాయితీలు ఎన్నో...

కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 2006లోనే సీనియర్‌ సిటిజన్స్‌ కార్డు కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. వయోవృద్ధుల కార్డు కలిగిన వారు ఆర్టీసీ బస్సులో టికెట్‌పై 25 శాతం రాయితీ, రైల్వే స్టేషన్‌లో ప్రత్యేకంగా టికెట్‌ కౌంటర్‌ ఉంటుంది. అవసరమైనవారు ఉపయోగించుకునేలా వీల్‌చైర్‌ సదుపాయం, ఒంటరిగా ప్రయాణించే మహిళలు, గర్భిణులకు లోయర్‌ బెర్త్‌ల రిజర్వేషన్‌ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది. పాస్‌పోర్టు సేవల్లోనూ వయోవృద్ధులకు రాయితీ అవకాశం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వారికి కొత్తగా పాస్‌పోర్టు పొందే సమయంలో స్లాట్‌ బుక్‌ చేసుకుంటే ఫీజులో 10 శాతం తగ్గింపు ఉంటుంది. కోర్టు కేసుల తేదీల కేటాయింపుల్లోనూ సీనియర్‌ సిటిజన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ సీనియర్‌ సిటిజన్‌లకు సంబంధించిన కేసుల విచారణలో న్యాయస్థానాలు ప్రాధాన్యమిస్తాయి. అంతేకాకుండా వారి అభ్యర్థన మేరకు ప్రత్యేక విచారణ తేదీలను కేటాయిస్తారు. బ్యాంకింగ్‌ సేవల్లోనే సీనియర్‌ సిటిజన్స్‌కు ఎంతో ఉపయోగం కలుగుతుంది. ఆదాయం పన్ను చెల్లింపులోనే 60 సంవత్సరాలు పైబడిన వారికి రూ. 3 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఉంటుంది. 80 ఏళ్లు దాటిన వారికి రూ. 5 లక్షల వరకు, 60 నుంచి 80 ఏళ్ల వయసున్న వారికి రూ. 3 నుంచి 5 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను రాయితీ, రూ.5-10లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను, రూ. 10 లక్షలకు పైగా 30 శాతం పన్ను రాయితీ ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య బీమా ప్రీమియంపై 80సీ సెక్షన్‌ కింద పన్ను తగ్గింపు వర్తిస్తుంది. ఇలాంటి వెసులుబాటులు ఎన్నో ఉన్న సీనియర్‌ సిటిజన్స్‌ కేవలం ఆధార్‌ కార్డు, పాన్‌కార్డుతో పాటు రెండు ఫొటోలతో జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఒకే రోజులో సీనియర్‌ సిటిజన్‌ కార్డు పొందే అవకాశం ఉంది. ఈ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది.

అర్హలైన ప్రతీ ఒక్కరు కార్డు పొందవచ్చు...

పురుషుల్లో 60 సంవత్సరాలు, మహిళల్లో 58 సంవత్సరాలు పైబడిన వారు సీనియర్‌ సిటిజన్స్‌గా గుర్తిస్తారు. జిల్లాలో గుర్తించబడిన 18 వేల మంది సీనియర్‌ సిటిజన్స్‌ కార్డుకు అర్హులు వీరందరూ కార్డు పొంది ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలతో పాటు వెసులుబాటును సద్వినియోగం చేసుకోవచ్చు. వయసు ధ్రువీకరణ పత్రంతో పాటు రెండు ఫొటోలు తీసుకొచ్చి దరఖాస్తు చేసుకుంటే ఒకే రోజు కార్డు మంజూరు చేస్తాం. గ్రామీణ స్థాయిలో వయోవృద్ధుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

- సుధారాణి, జిల్లా సంక్షేమశాఖ అధికారి, వనపర్తి.

Updated Date - May 26 , 2025 | 11:41 PM