Share News

బడి బస్సులు భద్రమేనా ?

ABN , Publish Date - May 23 , 2025 | 11:29 PM

విద్యా సంస్థలు ప్రారంభమయ్యే సమయానికి స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి చేసుకోవాల్సి ఉంది.

బడి బస్సులు భద్రమేనా ?
గత ఏడాది వనపర్తి మండల పరిధిలోని రాజనగరం సమీపంలో డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ప్రమాదానికి గురైన ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు ఫైల్‌

- స్కూల్‌ బస్సులకు ‘ఫిట్‌నెస్‌’ తప్పనిసరి

- వచ్చే నెల 15 వరకు పరీక్షలకు గడువు

- వనపర్తి జిల్లా వ్యాప్తంగా 314 బస్సులు

- ఇప్పటివరకు 42 బస్సులకు మాత్రమే తనిఖీలు

- మరో 20 రోజుల్లో విద్యా సంస్థలు ప్రారంభం

వనపర్తి, మే 23(ఆంధ్రజ్యోతి) : విద్యా సంస్థలు ప్రారంభమయ్యే సమయానికి స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండా స్కూల్‌ బస్సులను నడిపితే సీజ్‌ చేయడంతో పాటు భారీగా జరిమానా విధిస్తారు. ఈ విషయంపై వనపర్తి జిల్లా రవాణా శాఖ అధికారులు ఇప్పటికే ఆయా పాఠశాలల యాజమాన్యాలకు అవగాహన కల్పించారు. మరో 20 రోజుల్లో విద్యా సంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకు ముందే బస్సులకు మరమ్మతులు పూర్తి చేసుకొని ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాలని సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి స్కూల్‌ బస్సులను నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

కాలం చెల్లిన బస్సులు 73

జిల్లా వ్యాప్తంగా 314 స్కూల్‌ బస్సులు ఉన్నాయి. వాటిలో 15 ఏళ్లు దాటి, కాలం చెల్లిన బస్సులు 73 ఉన్నాయి. ఈ సారి వీటికి అధికారులు అనుమతులు ఇస్తారా? లేదా వేచి చూడాలి. మిగతా 241 బస్సుల్లో ఇప్పటి వరకు 42 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ తనిఖీలు చేయించుకున్నారు. ఇంకా 199 బస్సులకు ఫిట్‌నెస్‌ తనిఖీలు చేయించి, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి ఉంది. గత ఏడాది తీసుకున్న ఫిట్‌నెస్‌ ధ్రువపత్రాల గడువు ఈ నెల 15వ తేదీన ముగిసింది. పాఠశాలలు తెరిచే లోపు ఫిట్‌నెస్‌ తనిఖీలు చేయించుకోకుండా రోడ్డు ఎక్కితే అధికారులు బస్సులను సీజ్‌ చేసే అవకాశం ఉంది. ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవడానికి వచ్చే నెల 15వ తేదీ లోపు స్కూల్‌ యాజమాన్యాలకు అధికారులు గడువు ఇచ్చారు.

నిబంధనలు బేఖాతరు

జిల్లాలో చాలా పాఠశాలల బస్సులు సరైన కండిషన్‌లో లేనట్లు తెలుస్తోంది. అయినా రవాణా శాఖ అధికారుల నిబంధనలను బేఖాతరు చేస్తూ గత ఏడాది కొన్ని పాఠశాలల యాజమాన్యాలు బస్సులను నడిపించారు. వాటిల్లో కాలం చెల్లిన బస్సులు ఉన్నా పట్టించుకోవడం లేదు. గత ఏడాది స్కూలు బస్సులు ప్రమాదానికి గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే పాఠశాలలు పునఃప్రారంభం అయిన తర్వాత హడావిడిగా బస్సులను తనిఖీ చేసి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు స్పందించి జిల్లాలోని అన్ని స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ తనిఖీలు చేయించి, అనుమతులు తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఈ నిబంధనలు తప్పనిసరి

స్కూల్‌ బస్సులకు నిబంధనల మేరకు పూర్తి స్థాయిలో తనిఖీలు చేయించాల్సి ఉంది. బస్సులకు పవర్‌ స్టీరింగ్‌, డాష్‌ ప్యానెల్‌ బోర్డులో ఎడమ, కుడి ఇండికేటర్లు తప్పనిసరిగా ఉండాలి. బ్రేకుల లోపం తెలిపే ఎరుపు ఇండికేటర్‌ ఉండాలి. ప్యూయల్‌ గేజ్‌, స్పీడో మీటర్‌, డ్రైవర్‌ సీట్‌ దగ్గర ఎయిర్‌ హ్యాండ్‌ బ్రేక్‌ ఉండాలి. వెనుక దారి కనిపించేలా అద్దం, బస్సులో కూర్చున్న విద్యార్థుల కదలికలు కనిపించేలా ఇంటర్నల్‌ అద్దం. విద్యార్థులు ఎక్కడం, దిగడం కనిపించేలా క్రాస్‌ వ్యూ అద్దాలు తప్పనిసరిగా అమర్చుకోవాలి. అత్యవసర సమయంలో తలుపు అద్దం పగలగొట్టేందుకు సుత్తి, తలుపులకు సురక్షితమైన లాకింగ్‌ వ్యవస్థ ఉండాలి. బస్సు డ్రైవర్‌ వయసు 60 ఏళ్లకు మించి ఉండొద్దు. అతడు తప్పనిసరిగా లైసెన్స్‌ కలిగి ఉండాలి. బస్సు సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకోకూడదు. ప్రతీ బస్సులో ప్రథమ చికిత్స కిట్టు తప్పనిసరిగా ఉండాలి.

యాజమాన్యాలకు అవగాహన కల్పించాం

స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ విషయంపై సంబంధిత పాఠశాలల యజమాన్యాలకు అవగాహన కల్పించాం. బస్సులకు అధికారుల పర్యవేక్షణలో ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తాం. రవాణా శాఖ అధికారులు సూచించిన నిబంధనల మేరకు అన్ని భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాలు ఉన్న వాటికి మాత్రమే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇస్తాం. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు అధికారులకు సహకరించాలి.

- మానస, జిల్లా రవాణా శాఖ అధికారిణి

Updated Date - May 23 , 2025 | 11:29 PM