ఆగ్రహించిన సీడ్‌పత్తి రైతులు
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:20 PM
నేలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు సీడ్ ఆర్గనైజర్ల ద్వారా అన్యాయం జరుగుతోందని అన్నదాతలు ఆగ్రహించారు.
- న్యాయం చేయాలని 5 గంటల పాటు రహదారిపై బైఠాయింపు
- అదనపు కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ
అయిజ, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : నేలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు సీడ్ ఆర్గనైజర్ల ద్వారా అన్యాయం జరుగుతోందని అన్నదాతలు ఆగ్రహించారు. న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. వేసిన మొక్కలను తొలగించబోమని, నష్టాన్ని భరించలేమంటూ ఆవే దనవెలిబుచ్చుతూ దాదాపు 5 గంటల పాటు రహదారిపై అడ్డంగా కూర్చుని ఆందోళన చేశారు. ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలోని బింగిదొడ్డి గ్రామ స్టేజీ దగ్గర గద్వాల రహదారిపై చోటుచేసుకున్నది. బుధవారం ఉదయం 8 గంటలకు రైతులు బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ జ్యోతి, సీఐ టాటాబుబు, ఎస్‌ఐ శ్రీనివాసరావులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చచెప్పినా వి నలేదు. దీంతో దాదాపు 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవటంతో ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. అటు గద్వాల వైపు, ఇటు అయిజ వైపు 6 కిలోమీటర్లు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న గద్వాల డీఎస్పీ మొగులయ్య వచ్చి రైతులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. రైతులు వినలేదు. కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్లను నమ్ముకొని జిల్లా వ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో సీడ్ పత్తి సాగుచేశామని, ఎకరానికి 5 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని, తీరా పంట సాగుచేసి 2 నెలలు దాటిన తర్వాత 2 క్వింటాళ్ళ విత్తనాలు మాత్రమే తీసుకుంటాము, మిగతాది తమకు సంబంధం లేదని ఆర్గనైజర్లు చెప్పటంతో గందరగోళ పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేదిలేక డీఎస్పీ మొగులయ్య అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణకు ఫోన్ చేసి రైతులతో మాట్లాడించారు. సీడ్ ఆర్గనైజర్లు, రైతులతో కలిసి కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందుకు కలెక్టర్ కూడా అంగీకరించినట్లు చెప్పారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకాగా, వారికి మద్దతుగా వివిధ పార్టీల నాయకులు, రైతు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.