అంగన్‌వాడీ చిన్నారులకు అందని యూనిఫాంలు
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:23 PM
అంగన్‌వాడీల్లో చదువుకుంటున్న చిన్నారులకు ఇప్పటివరకు యూనిఫాంలు అందలేదు.
- జిల్లా కార్యాలయంలోనే మురిపిస్తున్న వస్త్రం
- వనపర్తి జిల్లాలో 589 అంగన్‌వాడీ కేంద్రాలు
వనపర్తి రూరల్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : అంగన్‌వాడీల్లో చదువుకుంటున్న చిన్నారులకు ఇప్పటివరకు యూనిఫాంలు అందలేదు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు, నాణ్యమైన విద్యాబోధన జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునికీకరణకు చర్యలు తీసుకుంది. వారి కోసం ఆటవస్తువులు, క్రీడా సామగ్రిని కూడా పంపిణీ చేసింది. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చినట్లుగానే అంగన్‌వాడీ చిన్నారులకు కూడా యూనిఫాంలు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా గత ఏడాది సెప్టెంబర్ నెలలో మొదటి విడతగా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేసింది. మిగతా కేంద్రాలకు రెండో విడతలో పంపిణీ చేసింది. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్‌లో చిన్నారులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేయాల్సి ఉండింది. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. యూనిఫాం తయారీ కోసం ప్రభుత్వం పంపించిన వస్త్రాలు జిల్లా శిశు సంక్షేమ కార్యాలయంలోనే ఉండిపోయింది. ఎన్ని యూనిఫాంలకు సరిపోయే వస్త్రం వచ్చింది? కుట్టు బాధ్యతలను ఎవరికి ఇస్తారు? ఆ పని ఎప్పుడు పూర్తవుతుంది? చిన్నారులకు ఎప్పుడు పంపిణీ చేస్తారు? తదితర అంశాలపై జిల్లా అధికారులకే స్పష్టత లేకుండా పోయింది.
19,604 మంది చిన్నారులు
వనపర్తి జిల్లాలోని మూడు ప్రాజెక్టుల్లో మొత్తం 589 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 171 కేంద్రాలున్నాయి. ఇతర ప్రాంతాల్లో 418 కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఆయా కేంద్రాలకు 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు చిన్నారులు 13049, 3 సంవత్సరాల నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలు 6,555 మంది, మొత్తం 19604 మంది చిన్నారులు వస్తున్నారు. వారందరికీ యూనిఫాంలు అందించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో వారందరూ సాధారణ దుస్తులతోనే కేంద్రాలకు హాజరవుతున్నారు. యూనిఫాంల తయారీకి అవసరమైన వస్త్రం సిద్ధంగా ఉన్నా, కుట్టు పని ఇంకా ప్రారంభం కాలేదు. గత ఏడాది ఆ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించారు. మూడు రకాల సైజుల్లో యూనిఫాంలను తయారు చేసి చిన్నారులకు పంపిణీ చేశారు. అయితే చాలా మందికి అవి సరిపోకపోవడంతో, సూపర్‌వైజర్ల సహకారంతో ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి తెప్పించి అందరికీ సర్దుబాటు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆ ఉసే లేకుండా పోయింది.
ఆదేశాలు రాలేదు
సుధారాణి, డీడబ్ల్యూవో : అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు అందించాల్సిన యూనిఫాం తయారీ కోసం అవసరమైన వస్త్రం ఇప్పటికే జిల్లాకు వచ్చింది. కానీ యూనిఫాంల కుట్టు పనికి సంబంధించి అధికారుల నుంచి మార్గదర్శకాలు రాలేదు. గత ఏడాది ఆ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించారు. ఈ ఏడాది ఎవరికి అప్పగిస్తారో డీఆర్‌డీవో అధికారులకే తెలుసు. మార్గదర్శకాలు వస్తే తగిన చర్యలు తీసుకుంటాం.