Share News

అంతర్రాష్ట్ర బ్రిడ్జి నిర్మించాలి

ABN , Publish Date - Jul 08 , 2025 | 11:37 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని మద్దిమడుగు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానదిపై అంతర్రాష్ట్ర బ్రిడ్జిని నిర్మించాలని

అంతర్రాష్ట్ర బ్రిడ్జి నిర్మించాలి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం ఇచ్చి సమస్యను వివరిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి

అచ్చంపేట, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని మద్దిమడుగు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానదిపై అంతర్రాష్ట్ర బ్రిడ్జిని నిర్మించాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు వచ్చిన ఆయనను ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ శ్రీశైల దేవస్థానం పాలకమండలిలో అచ్చంపేటకు చెందిన వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ గత ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే సందర్భంగా కూడా వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి వంతెన నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఏపీ లోని మాచర్ల నుంచి అచ్చంపేటకు రావాలంటే 379 కిలోమీటర్లు అవుతుందని చెప్పారు. బ్రిడ్జి నిర్మిస్తే చేపడితే దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. అలా గే జడ్చర్ల, అచ్చంపేట, మద్దిమడుగు మీదుగా మాచర్ల వరకు రవాణా సౌలభ్యం కలుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేందర్‌, నాయకులు కాశన్న యాదవ్‌, మల్లేశ్‌ తదితరులు కలిసి సీఎం చంద్రబాబుకు నల్లమల టైగర్‌ చిత్రపటాన్ని బహూకరించారు.

Updated Date - Jul 08 , 2025 | 11:37 PM