అలుగు పారిన చెరువు.. ప్రధాన రహదారిపైకి నీళ్లు
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:27 PM
మండలంలోని పోలేపల్లి గ్రామ సమీపంలోని శ్రీరంగనాయక చెరువు అలుగు పారుతోంది.
- నిలిచిన పోలేపల్లి, కిష్టారం మధ్య రాకపోకలు
జడ్చర్ల, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని పోలేపల్లి గ్రామ సమీపంలోని శ్రీరంగనాయక చెరువు అలుగు పారుతోంది. నీళ్లన్నీ పోలేపల్లి నుంచి కిష్టారం వెళ్లే ప్రధాన రహదారిపైకి వచ్చి చేరాయి. దీంతో ఆ దారి గుండా రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రహదారిపై సుమారు 2 నుంచి 3 ఫీట్ల మేర నీళ్లు పారుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, కార్లు, లైట్ మోటర్ వెహికల్స్ ఆ దారి గుండా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కిష్టారం, పోలేపల్లి గ్రామాలకు వెళ్లే వారంతా ఉదండాపూర్, వల్లూరు, జడ్చర్ల నుంచి మాచారం మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం ప్రధానరహదారిపై నీటి ఉధృతిని గమనించని ఓ ద్విచక్ర వాహనదారుడు ఆ నీళ్లలో చిక్కుకుపోయాడు. సమీపంలోని కొందరి సహయంతో ఒడ్డుకు చేరాడు. మండలంలోని గంగాపురంలో సత్యమ్మ, సత్తయ్యలకు చెందిన ఇల్లు కూలింది. శనివారం అర్ధరాత్రి అనంతరం ఇల్లుకు ఓ వైపు ఉన్న గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వారంతా అప్రమత్తమై ఇంట్లో నుంచి బయటికి వచ్చారు. దీంతో ఎవరికీ ఎలాంటి సంఘటనలు జరుగలేదు.