పొద్దంతా పడిగాపులే..
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:03 PM
రైతులకు యూరియా కష్టాలు తీరటం లేదు. యూరియా కొరత రైతులను కంటతడి పెట్టిస్తోంది.
- బస్తా యూరియా కోసం తప్పని తిప్పలు
రైతులకు యూరియా కష్టాలు తీరటం లేదు. యూరియా కొరత రైతులను కంటతడి పెట్టిస్తోంది. యువ రైతులు, మహిళలు, వృద్ధులు సైతం యూరియా కోసం గంటలకొద్ది బారులు తీరారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు తమ గోడు వెళ్లబోశారు. బుధవారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ దగ్గర జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ గోదాం, మన గ్రోమోర్ షాపు దగ్గర యూరియాను దిగుమతి చేస్తున్నారని రైతులకు తెలిసింది. దాంతో తెల్లవారు జామునుంచే వరుసలో నిలబడ్డారు. ఎక్కువసేపు నిలబడి అలసి.. చెప్పులు, సంచులు లైన్ కోసం పెట్టారు. పరిస్థితి గమనించిన పోలీసులు అక్కడికి చేరుకుని స్టాకు ఉన్నంత వరకు ఒకరి తరువాత ఒకరు యూరియా తీసుకునేటట్లు రక్షణ కల్పించారు. కాగా, యూరియా కొరత లేదని ఏడీఏ రాంపాల్, ఏవో శ్రీనివాసులు తెలిపారు.
- పాలమూరు, ఆంధ్రజ్యోతి