Share News

ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించాలి

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:04 PM

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జూనియర్‌ కళాశాలల్లో 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు కచ్చితంగా వేయించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి ఆదేశించారు.

ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించాలి
పిల్లలతో మాత్రలు వేయిస్తున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

కలెక్టర్‌ విజయేందిర బోయి

ఘనంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం) ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జూనియర్‌ కళాశాలల్లో 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు కచ్చితంగా వేయించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధిరోడ్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోలమ్‌ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పిల్లల్లో నులిపురుగులు ఉండడం వలన వారిలో పోషకాహారలోపం, రక్తహీనత, ఆకలి మందగించడం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని అన్నారు. అన్ని చోట్ల ఈ మాత్రలు అందుబాటులో ఉంచామని, తప్పకుండా అందరికీ వేయించాలని చెప్పారు. ఈనెల 11న ఏవేని కారణాలతో మాత్రలు వేయించుకోలేని వారు తిరిగి ఈనెల 18న నిర్వహించే మా పప్‌ డే రోజు వేయించాలని సూచించారు. దీనిపై ఎలాంటి అపోహలు పడొద్దని, ఈ మాత్రలు వేసుకోవడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు కలగవని అన్నారు. భోజనం అనంతరం వేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కృష్ణ, డీఐవో డాక్టర్‌ పద్మజ పాల్గొన్నారు.

మొదటి రోజు 2,31,646 మందికి..

జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 2,54,210 మంది ఉన్నారు. వీరందరికి ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి రోజు 2,31,646 మందికి మాత్రలు వేశారు. మిగిలిపోయిన వారికి ఈనెల 18న నిర్వహించే మాప్‌ అప్‌ డే రోజు వేయనున్నారు.

Updated Date - Aug 11 , 2025 | 11:04 PM