Share News

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:16 PM

ప్రభుత్వం కేటాయించిన భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని కలెక్టర్‌ విజయేందిర బోయి జిల్లా అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు
లక్ష్మీనగర్‌కాలనీలో ఎస్సీ కార్పొరేషన్‌ భూములను పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

- కలెక్టర్‌ విజయేందిర బోయి

- లక్ష్మీనగర్‌కాలనీ సర్వేనెం 247, 250 భూముల పరిశీలన

మహబూబ్‌నగర్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం కేటాయించిన భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని కలెక్టర్‌ విజయేందిర బోయి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్‌కాలనీ సర్వే నెం 247, 250లో ఎస్పీ కార్పొరేషన్‌కు కేటాయించిన 30 గుంటల భూమిని పరిశీలించారు. ఈ స్థలంలో ఎస్సీ హాస్టల్‌తో పాటు ఎస్సీ కార్పొరేషన్‌ అభివృద్ధికి స్థలం కేటాయించగా, గురువారం కలెక్టరేట్‌లో జరిగిన విజిలెన్స్‌ మానిటరింగ్‌ పీఓఏ చట్టం సమావేశంలో కమిటీ సభ్యులు ఇట్టి భూమి ఆక్రమణకు గురవుతుందని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్‌, మధుసూదన్‌నాయక్‌, ఆర్డీవో నవీన్‌, అర్బన్‌ తహసీల్దార్‌ ఘన్షీరాం, ఎస్సీ కార్పొరేషన్‌ ఇన్‌చార్జి ఈడీ వెంకట్‌రెడ్డి, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి సునీత, మునిసిపల్‌, ల్యాండ్‌ సర్వే అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్‌ అధికారులు వెంటనే సర్వే చేసి హద్దులు నిర్ణయించాలన్నారు. షెడ్యూల్డ్‌ కులాల శాఖ భూమి రక్షణకు ఫెన్షింగ్‌ ఏర్పాటు చేసుకోవాలని, ఆక్రమణలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు.

చిత్తడి నేలలను పరిరక్షించుకోవాలి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ : పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల పెరుగుదల దృష్ట్యా, చిత్తడి నేలలను పరిరక్షించుకోవడం అత్యంత అవసరమని కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా వెబ్‌ల్యాండ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చిత్తడి నేలల భౌగోళిక గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఇందుకోసం అటవీ, రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్‌, ఇరిగేషన్‌, సర్వే విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోపు గుర్తింపు పక్రియను పూర్తి చేయాలన్నారు. డీఎఫ్‌ఓ సత్యనారయణ, డీఆర్డీవో నరసింహులు, వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్‌ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, మత్స్యశాఖ అధికారిణి రాధారోహిణి, డీపీవో నిఖిల పాల్గొన్నారు.

మోడల్‌ న్యూట్రీ గార్డెన్‌గా రూపొందించాలి

చిన్నచింతకుంట : లాల్‌కోటలో న్యూట్రీ గార్డెన్‌ ఏర్పాటు అభినందనీయమని, దీన్ని మోడల్‌ న్యూటీ గార్డెన్‌గా రూపొందించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని లాల్‌కోట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ సందర్శించి, పాఠశాలలో నిర్వహిస్తున్న న్యూట్రీ గార్డెన్‌ పరిశీలించి అభినందించారు. మోడల్‌ న్యూటీ గార్డెన్‌గా రూపొందించుటకు హార్టికల్చర్‌ శాఖ సహకారం తీసుకోవాలన్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఖగోళ శాస్త్ర ప్రయోగశాలను సందర్శించి ప్రయోగశాల గురించి విద్యార్థులందరికీ ప్రయోగ విధానం, నైపుణ్యాలు రావాలని కోరారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తహసీల్దార్‌ ఎల్లయ్య, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఎంఈవో మురళికృష్ణ, పంచాయతీ కార్యదర్శి రాజు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 11:16 PM