Share News

ఏడుగురు ఎస్‌జీటీలపై చర్యలు

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:29 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో స్పౌజ్‌ పాయింట్లను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 7గురు సెకండరీ గ్రేడ్‌ టీచర్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం అయ్యింది.

ఏడుగురు ఎస్‌జీటీలపై చర్యలు
మహబూబ్‌నగర్‌ డీఈవో కార్యాలయం

- జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్‌కుమార్‌

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ జిల్లాలో స్పౌజ్‌ పాయింట్లను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 7గురు సెకండరీ గ్రేడ్‌ టీచర్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం అయ్యింది. 2024లో చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నా, అప్పటి డీఈవో రవీందర్‌ పలు ప్రలోభాలకు తలొగ్గినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పు చేసిన టీచర్ల నుంచి ముడుపులు తీసుకొని వారిపై చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. వారిని తప్పించాలని, ఏదో విధంగా కాలయాపన చేయాలన్న ఉద్దేశంతో ఆ ఏడుగురికి సంబంధించిన ఫైల్‌ను డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయానికి పంపించారు. ఈ విషయం డీఈవో పరిధిలోకే వస్తుందని, తమకు ఎందుకు ఫైల్‌ పంపించారని చీవాట్లు పెట్టినట్లు సమాచారం. అంతటితో ఆ ఫైల్‌ అగిపోయింది. అదే సమయంలో అప్పటి డీఈవో రవీందర్‌ ఏసీబీకీ పట్టుబడటంతో పూర్తిగా మూలన పడింది. తాజాగా స్పౌజ్‌ పాయింట్ల విషయంలో జీహెచ్‌ఎంలకు ఆర్‌జేడీ నుంచి రెండవ సారి నోటీసులు వచ్చాయి. దీంతో ఎస్‌జీటీల విషయం మళ్లీ తెరపైకి వచ్చింది ఈ అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’లో పలు వరుసకథనాలు ప్రచురితం కావడం కలకలం రేపింది. అందులో భాగంగా ఈనెల 24న ప్రచురించిన కథనం మేరకు డీఈవో కార్యాలయంలో ఎస్‌జీటీ సెక్షన్‌ సిబ్బంది నుంచి వివరణ తీసుకున్నారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్నది వీరే..

స్పౌజ్‌ పాయింట్లను దుర్వినియోగం చేసి, తమకు అనుకూలంగా ఉన్న పాఠశాలల్లో స్థానం పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు సెకండరీ గ్రేడ్‌ టీచర్ల వివరాలను డీఈవో ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. వి.సురేఖ (మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం, చౌదర్‌పల్లి ఎంపీపీఎస్‌) బి.శారద (జడ్చర్ల మండలం, కావేరమ్మపేట పీఎస్‌), డి.విజయలక్ష్మి (ఎంపీపీఎస్‌, వల్లూరు), ఎం.జ్యోతి (పీఎస్‌, మాచారం), జె.శివలీల (పీఎస్‌ ఆలూరు), సంయుక్తా రాణి (అడ్డాకుల మండలం, శాఖాపూర్‌, పీఎస్‌) యాదయ్య (భూత్పూర్‌ మండలం, గోపులాపూర్‌ పీఎస్‌)లకు ఇప్పటికే నోటీసులు అందించినట్లు డీఈవో కార్యాలయం ఎస్‌జీటీ సెక్షన్‌ సిబ్బంది తెలిపారు. ఈ విషయంపై డీఈవో ప్రవీణ్‌కుమార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరింది. వారికి గతంలోనే నోటీసులు ఇచ్చారని, ఇప్చుడు మళ్లీ నోటీసులు ఇవ్వాలా అన్న విషయాన్ని పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో మరో రెండు మూడు రోజుల్లో దృష్టి పెడతాం.

Updated Date - Apr 29 , 2025 | 11:29 PM