ధాన్యం సేకరణకు కార్యాచరణ రూపొందించాలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 10:58 PM
వానాకాలం 2025-26 సీజన్‌లో జిల్లాలో ధాన్యం సేకరణకు ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయా శాఖల అధికారులను రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఆదేశించారు.
- రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : వానాకాలం 2025-26 సీజన్‌లో జిల్లాలో ధాన్యం సేకరణకు ముందస్తుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయా శాఖల అధికారులను రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ క్రాస్ బుకింగ్ డేటా ప్రకారం జిల్లాలో 1,71,781 ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు, దాదాపు 4.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో 3.60 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం ఉత్పత్తి అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం 3 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని అంచనా. అనంతరం 2024-25 సీఎంఆర్ డెలివరీపై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. వానాకాలం 2024-25 ధాన్యం గడువు సెప్టెంబరు 12వ వరకు భారత ప్రభుత్వం పొడిగించిందని, ప్రతీ మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. పౌర సరఫరాల సంస్థ జిల్లా అధికారి గంప శ్రీనివాస్, జిల్లా మేనేజర్ రవినాయక్, జిల్లా సహకార అధికారి శంకరచారి, జిల్లా మార్కెటింగ్ అధికారిని బాలమణి, డీఆర్డీవో అడిషనల్ పీడీ శారద, వ్యవసాయ శాఖ ఏడీ హైమావతి పాల్గొన్నారు.