హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:13 PM
హత్యాయత్నం కేసులో 10 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురి అరెస్ట్ చేశారు.
బాలానగర్, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : హత్యాయత్నం కేసులో 10 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురి అరెస్ట్ చేశారు. గురువారం బాలనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. మండలంలోని చిన్నంగుల గడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని కేజీబీవీ పాఠశాల గేటు ముందు ఈనెల 10న సబావత్ బాలునాయక్ అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో బాలునాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు కేసును ఛేదించారు. గంగారెడ్డిగూడ గ్రామపంచాయతీకి చెందిన బాలునాయక్, సబావత్ శ్రీనివాసులు మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విభేదాలున్నాయి. దీంతో శ్రీనివాసులునాయక్ కొందరు వ్యక్తులకు డబ్బులిచ్చి బాలునాయక్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే ఈనెల 10 కేజీబీవీ ముందు ఉన్న బాలునాయక్‌ను శ్రీనువాసులునాయక్ అనుచరులు కారుతో ఢీకొట్టి మారణాయుధాలతో హత్య చేసే ప్రయత్నం చేయగా, బాలునాయక్ తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు విచారణ చేసి హత్యాయత్నం చేసిన వినయ్‌కుమార్, శ్రీనాథ్, మహ్మద్‌కరీం, చంద్రారావు, రోహన్‌సింగ్, రాకేశ్, అమ్రేశ్‌జైస్వాల్‌లను అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారిలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని రిమాండ్‌కు తరలించారు. జడ్చర్ల సీఐ నాగార్జున, ఎస్‌ఐ లెనిన్ పాల్గొన్నారు.