ల్యాండ్ రికార్డు ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాలు
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:26 PM
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని రెవెన్యూ ల్యాండ్ రికార్డు ఏడీ కొత్తం శ్రీనివాసులు ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేశారు. ఏకకాలంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో సోదాలు చేయగా, ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌లోని ఆయన నివాసం, నారాయణపేట జిల్లాలోని మక్తల్ సమీపంలో ఉన్న గుడెబల్లూరు రైస్‌మిల్లులో రెండు బృందాలు సోదాలు చేశాయి.
పాలమూరులో 4, నారాయణపేటలో 3 ప్లాట్లు.. రైస్ మిల్లు ఉన్నట్లు గుర్తింపు
పెద్ద ఎత్తున బంగారు, వెండి నగలు, నగదు కూడా..
మహబూబ్‌నగర్, డిసెంబరు4 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని రెవెన్యూ ల్యాండ్ రికార్డు ఏడీ కొత్తం శ్రీనివాసులు ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేశారు. ఏకకాలంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో సోదాలు చేయగా, ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌లోని ఆయన నివాసం, నారాయణపేట జిల్లాలోని మక్తల్ సమీపంలో ఉన్న గుడెబల్లూరు రైస్‌మిల్లులో రెండు బృందాలు సోదాలు చేశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు కొనసాగాయి. లక్ష్మీనగర్ కాలనీలోని ఆయన నివాసంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఈయన కొంతకాలంలో ఇక్కడి కలెక్టరేట్‌లో సర్వేయర్‌గా పనిచేశారు. తరువాత పదోన్నతిపై ఏడీగా రంగారెడ్డి జిల్లాలో పని చేస్తున్నారు. తనిఖీల్లో మహబూబ్‌నగర్‌లో నివాసంతో పాటు నాలుగు ప్లాట్లు, నారాయణపేటలో 3 ప్లాట్లు ఉన్నట్లు తేలింది. రైస్‌మిల్లు కూతురు పేరిట ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితోపాటు కర్ణాటక, అనంతపూర్‌లలో 22 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పెద్దఎత్తున బంగారు, వెండి నగలు, నగదు గుర్తించారు.