Share News

పేదలపై పిడుగు

ABN , Publish Date - Oct 22 , 2025 | 10:38 PM

పిడుగులు పేదల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పంటల సాగుకు అత్యంత కీలక సమయమైన వర్షాకాలంలోనే ఈ ప్రమాదం పొంచి ఉంటోంది.

పేదలపై పిడుగు
బింగిదొడ్డి గ్రామంలో పిడుగు పడి దగ్ధం అవుతున్న కొబ్బరి చెట్టు (ఫైల్‌)

- పొలం పనుల్లో ఉన్నప్పుడే ఎక్కువ

- ప్రాణాలు కోల్పోతున్న రైతులు, కూలీలు

- చనిపోతున్న పశువులు, గొర్రెలు, మేకలు

- ముందు జాగ్రత్తలతో తప్పనున్న ముప్పు

అయిజ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : పిడుగులు పేదల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పంటల సాగుకు అత్యంత కీలక సమయమైన వర్షాకాలంలోనే ఈ ప్రమాదం పొంచి ఉంటోంది. రైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో వర్షం పడితే, వారు సమీపంలోని చెట్ల కిందకు చేరుతున్నారు. అదే సమయంలో పిడుగు పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వారితో పాటు పశువులు, మూగజీవాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. రైతులు, కూలీలకు అవగాహన లేక ముందు జాగ్రత్త లు తీసుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు.

పెరుగుతున్న మరణాలు

ఇటీవల కాలంలో పిడుగుపాటు మరణాలు ఎక్కువయ్యాయి. గత నెల 10వ తేదీన జోగుళాంబ గద్వాల జిల్లా, అయిజ మండలంలోని భూమ్‌పూర్‌ సమీపం లోని పొలంలో కూలీలు పని చేస్తుండగా వర్షం పడింది. దీంతో వారు సమీపంలోని తాటి చెట్ల కిందకు వెళ్లి నిలుచున్నారు. అదే సమయంలో పిడుగు పడటం తో పులికల్‌ గ్రామానికి చెందిన సౌభాగ్యమ్మ, సర్వేశ్‌, పార్వతి ప్రాణాలు కోల్పోయారు. ఈనెల 21న రాజోళి మండలంలోని ముండ్లదిన్నె గ్రామానికి చెందిన కుర్వ మద్దిలేటి పొలం పనులు చేస్తుండగా, పిడుగు పడి మృతి చెందాడు. అలాగే ఇదే సంవత్సరం మానవ పాడు మండలంలోని చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన బోయ వెంకటేశ్‌, వడ్డేపల్లి మండలంలోని బుడమర్సుకు చెందిన మహేంద్ర పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయారు. కేటీదొడ్డిలో రైతు వేమారెడ్డికి చెందిన గేదెలు చనిపోయాయి. ధరూరు మండలంలో నర్సింహులుకు చెందిన రెండు కాడెద్దులు మృతి చెందాయి. మల్దకల్‌ మండలంలోని ఆలూరు బుడ్డన్నకు చెందిన 15 గొర్రెలు మత్యువాత పడ్డాయి. మొత్తంగా పరిశీలిస్తే పిడుగు పాటుకు బలవుతున్న వారిలో రైతులు, కూలీలే అధికంగా ఉన్నారు.

తక్షణ చర్యలు అవసరం

పిడుగుపాటుకు గురైన వ్యక్తికి సీపీఆర్‌ (కార్డియో పల్మోనరీ రిససిటేషన్‌) అందించాలి. సాధ్యమైనంత త్వరగా అంబులెన్స్‌కు సమాచారం అందించి బాధితు డిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. సరైన సమయంలో చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్తు న్నారు. అలాగే పిడుగుపాట్లకు సంబంధించిన ముం దస్తు సమాచారాన్ని అందించేందుకు ప్రభుత్వాలు యాప్‌లు, ఇతర మాధ్యమాల ద్వారా ఇచ్చే వాతావరణ సూచనలు, హెచ్చరికలను గమనిస్తూ ఉండాలి.

అవగాహన లేక అనర్థాలు

పిడుగుపాట్లపై గ్రామీణ ప్రాంత ప్రజలకు, ప్రధానంగా రైతులు, వ్యవసాయ కూలీలకు అవగాహన కల్పించాల్సి ఉంది. సరైన అవగాహన లేకనే వారు ప్రాణాలు కోల్పోతున్నారు. పొలం పనుల్లో ఉన్నప్పుడు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తే వెంటనే ఇళ్లకు చేరుకోవడం మంచిదని చెప్తున్నారు. వర్షం వచ్చే సమయంలో సెల్‌ఫోన్లను స్విచ్‌ ఆఫ్‌ చేయాలని అంటున్నారు. ఎత్తయిన చెట్లు, కొండలు, సెల్‌ఫోన్‌ టవర్లు, విద్యుత్‌ స్తంభాలు, ఎలక్ర్టిక్‌ వస్తువులు, పరికరాలకు దూరంగా ఉండాలి. అలాగే ఎత్తయిన భవనాల్లో తల దాచుకుంటే, కిటికీలు, తలుపులకు దగ్గరగా ఉండకూడదని చెప్తున్నారు. అలాగే పశువులను కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. ఎత్తయిన భవనాలకు లైటనింగ్‌ కండక్టర్లను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.

Updated Date - Oct 22 , 2025 | 10:38 PM