Share News

పురుడు పోసుకున్న అరుదైన పాము

ABN , Publish Date - Jun 26 , 2025 | 11:18 PM

జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని జీవ వైవిధ్య పరిశోధన, విద్యా కేంద్రంలో అరుదైన పాము పురుడు పోసుకుందని వృక్షశాస్త్ర సహయ చార్యులు డాక్టర్‌ సదాశివయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..

పురుడు పోసుకున్న అరుదైన పాము
విష రహిత రాబ్ధోఫీస్‌ ప్లంబికలర్‌ పాము పిల్లలు

జడ్చర్ల, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని జీవ వైవిధ్య పరిశోధన, విద్యా కేంద్రంలో అరుదైన పాము పురుడు పోసుకుందని వృక్షశాస్త్ర సహయ చార్యులు డాక్టర్‌ సదాశివయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని వీరన్నపేటలో ఏప్రిల్‌ 30న ఓ ఇంట్లోకి పాము వచ్చింది. దానిని చంపకుండా స్థానికుడైన లోకేశ్‌ పట్టుకుని జీవ వైవిధ్య పరిశోధన కేంద్రంలో అప్పగించాడు. అప్పుడే ఆ పాము 9 గుడ్లు పెట్టింది. ఆ పామును రాబ్ధోఫీస్‌ ప్లంబికలర్‌ అనే విషరహిత పాముగా గుర్తించారు. కోలుబ్రిడే అనే కుటుంబానికి చెందినది. అది పెట్టిన గుడ్లను బయోడైవర్సిటీ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో నిల్వ చేశారు. ఆ గుడ్లలో నుంచి గురువారం నాలుగు పాము పిల్లలు బయటికి వచ్చాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనే పాములు గుడ్లు పొదుగుతాయని, కానీ జూన్‌లో పొదగడం వాతావరణంలో వచ్చే మార్పులకు నిదర్శనమని సదాశివయ్య తెలిపారు. ఈ పాములు మెడపై బాణం ఆకారంలో పసుపురంగు గుర్తును కలిగి ఉంటాయని, కంటి నుంచి నోటి వరకు నలుపు చార ఉంటుందని వివరించారు. ఇవి ఎత్తయిన అటవీ ప్రాంతంలో అధికంగా ఉంటాయని, కేవలం భారత ఉపఖండంలో మాత్రమే జీవిస్తాయని, దక్షిణ భారతదేశంలో అధికంగా ఉంటాయని చెప్పారు. పాము పిల్లలను అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని తెలిపారు.

Updated Date - Jun 26 , 2025 | 11:18 PM