కృష్ణానదిలో ఆనంద విహారం
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:36 PM
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో ఏసీ లాంచీ ప్రయాణం నేటి నుంచి ప్రారంభం కానున్నది.
- సోమశిల వద్ద నేటి నుంచి ఏసీ లాంచీ ప్రయాణం
- కనువిందు చేయనున్న అటవీ అందాలు, జల సోయగాలు
- పెద్దలకు రూ. 2000, పిల్లలకు రూ.1600 చార్జీలు
కొల్లాపూర్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో ఏసీ లాంచీ ప్రయాణం నేటి నుంచి ప్రారంభం కానున్నది. పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశానుసారం టూరిజం శాఖ అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వారానికి మూడు రోజుల పాటు ఏసీ లాంచి సేవలు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 10 గంటలకు సోమశిల నుంచి లాంచీ బయలుదేరి, అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీశైల క్షేత్రంలోని పాతాళగంగకు చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు సోమశిలకు చేరుకుంటుంది. ఆసక్తిగల పర్యాటకులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయొచ్చు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీలో ప్రయాణం చేసేందుకు పెద్దలకు 2 వేలు, పిల్లలకు 16 వందలు ధరగా నిర్ణయించారు. లాంచీలోనే తిరిగి వచ్చేందుకు అదే ధర చెల్లించాల్సి ఉంటుంది. ఒక ట్రిప్పులో దాదాపు 100 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. వారికి టీ, టిఫిన్, స్నాక్స్ కూడా అందిస్తారు. దారిలో కొండల మధ్య ప్రవహించే కృష్ణమ్మ సోయగాలను, ఇరువైపులా నల్లమల అటవీ సౌందర్యం కనువిందు చేయనున్నది.