ప్రణాళిక ఉంటేనే ఫలితం
ABN , Publish Date - May 22 , 2025 | 10:53 PM
జూరాల ప్రాజెక్టుకు 2023 మినహా ఎనిమిదేళ్లుగా సమృద్ధిగానే వరద వస్తోంది. అయినప్పటికీ యాసంగి సీజన్‌లో సాగు, తాగునీటికి దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నీరందక పంటలు ఎండిపోతుండగా, దప్పిక తీర్చుకోవడానికి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయించుకోవాల్సి వస్తోంది.
సాగునీటిపై ప్లానింగ్ సరిగా లేక జూరాల కింద గతేడాది ఎండిన పంటలు
ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ.. ఎగువ నుంచి రాని చుక్క నీరు
ఎక్కువ వరద రోజులు నమోదవుతున్నా మారని పరిస్థితి
అధిక నీటిని నిల్వ చేసుకోవడం అత్యంత అవసరం
ప్రాజెక్టుకు ప్రస్తుతం 8,953 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మహబూబ్‌నగర్, మే 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జూరాల ప్రాజెక్టుకు 2023 మినహా ఎనిమిదేళ్లుగా సమృద్ధిగానే వరద వస్తోంది. అయినప్పటికీ యాసంగి సీజన్‌లో సాగు, తాగునీటికి దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నీరందక పంటలు ఎండిపోతుండగా, దప్పిక తీర్చుకోవడానికి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయించుకోవాల్సి వస్తోంది. అక్కడి నుంచి జూరాలకు వచ్చే వరకు నీరంతా ఆవిరి రూపంలోనో, గుంతలు నిండటానికో సరిపోతోంది. జూరాల ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీలకు పైగా పూడిక పేరుకుపోవడం, వస్తున్న నీటిని అవసరాలకు తగినట్లుగా వినియోగించుకోవడానికి సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల యాసంగిలో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడటానికి కారణాలవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతోనో లేక మరేదైన కారణాలతోనో ఐఏబీ(ఇరిగేషన్ అడ్వైయిజరీ బోర్డు) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండలేకపోతున్నారు. ఫలితంగా ఆయకట్టు పరిధిలో వేల ఎకరాల్లో పంట నష్టం జరుగుతోంది. ఈ ఏడాది యాసంగి సీజన్‌లో అదే జరిగింది. కానీ అధికారులు మాత్రం నీళ్లు అందకుండా ఎక్కడా పంటలు ఎండిపోలేదని నిర్ధారించారు. కేవలం అకాల వర్షాల ద్వారానే పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపడం గమనార్హం. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రధాన నీటి వనరుల్లో జూరాలదే అగ్రస్థానం. ఆయకట్టు పరిధిలోని లక్ష ఎకరాలతోపాటు నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలు, పలు తాగునీటి పథకాలు ఈ ప్రాజెక్టు ఆధారంగానే నడుస్తాయి. ఏటా సాగునీటి శాఖకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెబుతున్నప్పటికీ.. సోర్స్ ప్రాజెక్టు అయిన జూరాలను ఎవరూ పట్టించుకోవడం లేదనేది స్పష్టమవుతోంది. ఈ యాసంగిలో వారబందీ ప్రకటించినప్పటికీ.. పంటలకు నీరివ్వకపోవడంతో ఎండిపోయి, రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రాజెక్టు కూడా డెడ్ స్టోరేజీకి చేరడంతో ఇబ్బంది తలెత్తింది.
వరి సాగు పెరగడంతో మరింత ఇబ్బందులు..
గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి సీజన్‌లో మొక్కజొన్న, వేరుశనగ, శనగ, మినుము, మిల్లెట్స్ తదితర ఆరుతడి పంటలను సాగుచేసేవారు. కానీ నీటి వనరుల లభ్యత పెరగడం, వరికి సరైన గిట్టుబాటు ధర, ప్రభుత్వమే కొనుగోలు చేయడం, తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ వంటి కారణాలతో ఎక్కువ మంది దానిని సాగు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. దాంతో నీటి అవసరం పెరుగుతోంది. తద్వారా బోరుబావులు, కాలువల ద్వారా నీటి వినియోగం పెరిగింది. సాగునీటి ప్రణాళిక చేస్తున్నప్పుడు వ్యవసాయశాఖ ద్వారా వరికి ప్రత్యామ్నాయ పంటలపై ప్రజలకు అవగాహన కూడా పెంచాలి. కానీ ఆ విధంగా జరగడం లేదు. ప్రభుత్వం ఆదేశిస్తే తూతూమంత్రంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు తప్ప.. కచ్చితమైన పరిశీలన, పర్యవేక్షణ ఉండటం లేదు. ప్రభుత్వం కూడా ఆరుతడి పంటల ప్రోత్సాహానికి మార్కెటింగ్ సౌకర్యం, గిట్టుబాటు ధర, సబ్సిడీలపై దృష్టి సారించాలి. అలాగే ఈ నీటి వనరుల వినియోగం ఏ స్థాయిలో ఉందంటే వానాకాలంలో పైపైనే కనిపిస్తున్న నీరు.. యాసంగి వచ్చేసరికి భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. బోరుబావుల ద్వారా కూడా నీటి వినియోగం అధికంగా జరుగుతుండటమే ఇందుకు కారణం. దీనివల్ల సాగునీటితోపాటు తాగునీటి సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. దాంతో ప్రత్యామ్నాయ నీటి నిల్వ వనరులను నిర్మించడం, ఉన్న రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపడం, కచ్చితమైన ప్రణాళికను అనుసరించడం ద్వారా ఈ కష్టాలను అధిగమించే అవకాశం ఉంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 8,953 క్యూసెక్కుల వరద వస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ప్రణాళికలను అనుసరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
1125 టీఎంసీల రాక..
జూరాల ప్రాజెక్టు తెలంగాణలో కృష్ణానది ప్రవేశించిన తర్వాత వచ్చే తొలి ప్రాజెక్టు. భీమా నదికి వరద వచ్చినా జూరాలకు ఇన్‌ఫ్లో వస్తుంది. జూన్ 1 నుంచి మే 31 వరకు వాటర్ ఇయర్‌గా చూసుకుంటే, ఈ వాటర్ ఇయర్‌లో జూరాల ప్రాజెక్టుకు 1125 టీఎంసీల నీరు వచ్చింది. ఇందులో జూరాల సామర్థ్యం 9.65 టీఎంసీలే. లైవ్ స్టోరేజీ ఇంచిమించుగా ఆరు టీఎంసీలే అని చెప్పవచ్చు. కృష్ణానదికి 90 రోజులపాటు వరద వస్తుందని అంచనా. కానీ 2023 మినహా ఎనిమిదేళ్లుగా ఎక్కువగానే వరద రోజులు నమోదవుతున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలు నడుస్తున్నాయి. ఈ యాసంగి సీజన్‌కు ముందు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఐఏబీ సమావేశంలో వారబందీ ప్రకారం రామన్‌పాడు వరకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ పంట చేతికి వచ్చే సమయంలో తీవ్రంగా నీటి సమస్య ఏర్పడింది. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి 4 టీఎంసీలు విడుదల చేయాలని ఒప్పందం చేసుకున్నప్పటికీ, ఒక టీఎంసీ మాత్రమే విడుదల చేశారు. అందులోనూ 0.25 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టుకు చేరింది. నీటి సమస్య ఏర్పడటానికి ప్రధాన కారణం ఏంటంటే, జూరాల ఆధారంగా ఉన్న ఎత్తిపోతల పథకాల నిల్వ సామర్థ్యం సరిగా లేకపోవడం. ఏటా వందలాది టీఎంసీలు జూరాల ద్వారా దిగువకు వెళ్తున్నప్పటికీ మిగులు జలాలను కూడా నిల్వ చేసుకోలేకపోతున్న దుస్థితి ఉంది. నెట్టెంపాడు కింద ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్‌ను లీకేజీ సమస్య వల్ల 4 టీఎంసీలకు గాను 2 టీఎంసీలతోనే నింపుతున్నారు. భీమా కింద శంకరసముద్రం రిజర్వాయర్‌ను కూడా పూర్తిగా నింపలేని పరిస్థితి ఉంది. జూరాలలో పూడిక పేరుకుపోతున్న నేపథ్యంలో ఆ మేరకు నిల్వ సామర్థ్యం ఉన్న మరో వనరును నిర్మించాలనే విషయాన్ని కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.