మల్దకల్ జాతరకు భారీగా భక్తులు
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:20 PM
మల్దకల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
మల్దకల్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆటోలు, జీపులు, సొంత వాహనాలు, లారీలు, బస్సుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. గురువారం ఉదయం 8గంటల నుంచి అయిజ, గద్వాల రహదారితో పాటు మద్దెలబండ, ఎల్కూరు, వైపు నుంచి మల్దకల్ వైపు వచ్చే అన్ని రహదారులు వివిధ రకాలైన వాహనాల రాకతో కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం నుంచి మరింత రద్దీ పెరిగింది. దీంతో పోలీసులు వాహనాలను గ్రామ శివారులో పార్కింగ్ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా బందోబస్తును గురువారం ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతరలో షీ టీంలను, మఫ్టీలో ఫుట్ పెట్రోలింగ్, పిక్‌పాకెటర్ల వంటి నేరస్తుల కోసం సీసీఎస్ టీంలను మోహరింపజేయాలని ఆదేశించారు. అంతకుముందు లక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్ళించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు శేషవస్త్రంతో సన్మానించారు. ఆయన వెంట గద్వాల డాఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీను, మల్దకల్ ఎస్‌ఐ నందీకర్ ఉన్నారు.