ఘనంగా ‘సద్దుల’ సంబురం
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:19 PM
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
- వనపర్తి, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో వేడుకలు
- మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన కలెక్టర్లు, ఎస్పీలు
వనపర్తి రాజీవ్ చౌరస్తా/ నారాయణపేట/ మహబూబ్‌నగర్ న్యూటౌన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఆవరణలో సెర్ప్, మెప్మా, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన సంబురాలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ గిరిధర్ రావుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు. అద్భుతంగా తీర్చి దిద్దిన బతుకమ్మలకు బహుమతులు అందించారు. మెప్మా మహిళా సమాఖ్య ప్రథమ, పురపాలక శాఖ ద్వితీయ, వ్యవసాయ శాఖ తృతీయ బహుమతులను సొంతం చేసుకున్నాయి. నాలుగో స్థానంలో కలెక్టరేట్ నిలిచింది. కార్యక్రమంలో వివిధ శాఖల మహిళా అధికారులు, సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.
నారాయణపేట పట్టణంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరీ మాతకు కలెక్టర్ పూజలు చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన వేడుకల్లో మహిళా ఉద్యోగులు, యువతులు బతుకమ్మ పాటలకు ఆనందంగా నృత్యం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణం పండుగశోభను సంతరించుకున్నది.
మహబూబ్‌నగర్ పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మెప్మా, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఉద్యాన శాఖ, డీర్‌డీవో తదితర శాఖల ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన బతుకమ్మలు కనువిందు చేశాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు బతుకమ్మ ఆడుతూ మహిళలు సందడి చేశారు. బతుకమ్మ వేడుకలను విజయవంతం చేసిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి కలెక్టర్ విజయేందిర బోయి అభినందనలు తెలిపారు.