20.98 శాతం
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:16 PM
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో బీసీలకు 20.98 శాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కాయి. బీసీలకు ప్రస్తుతం 24 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఈ ఎన్నికల్లో అంతకంటే తక్కువ రిజర్వేషన్లు రావడం గమనార్హం.
పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీసీలకు కేటాయించిన సీట్ల శాతం ఇది
అన్ని పార్టీల పరంగా టికెట్లు దక్కకపోతే ఎక్కువగా నష్టం
వంద శాతం ఎస్టీ జనాభా స్థానాలతో ఎస్టీలకు 19.01 శాతం
ఎస్సీలకు 16.57 శాతం ... జనరల్‌కు 43.44 శాతం సీట్ల కేటాయింపు
అన్ని కేటగిరీల్లో కలిపి మహిళలకు 45.83 శాతం స్థానాలు
నేటి నుంచి మొదటి విడత నామినేషన్ల షురూ..
ఏర్పాట్లు చేసిన అధికారులు
మహబూబ్‌నగర్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో బీసీలకు 20.98 శాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కాయి. బీసీలకు ప్రస్తుతం 24 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఈ ఎన్నికల్లో అంతకంటే తక్కువ రిజర్వేషన్లు రావడం గమనార్హం. పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆయా జిల్లాల జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు జరిగినట్లు స్పష్టమవుతోంది. బీసీలకు గతంలో ఉన్న 24 శాతం రిజర్వేషన్లు కూడా దక్కలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అన్ని పార్టీలు 50 శాతం కంటే ఎక్కువ స్థానాలు బీసీలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. గత సర్పంచు ఎన్నికల్లో కూడా జనరల్ స్థానాల్లో చాలామంది బీసీలు గెలవడంతో ఆయా స్థానాల్లో వారికే పార్టీల మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించగా.. బీఆర్‌ఎస్, బీజేపీ కూడా అదే దారిలో నడుస్తాయని సమాచారం. ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది.
బీసీలకు 352 స్థానాలు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 1,678 సర్పంచు స్థానాలు ఉన్నాయి. అందులో బీసీలకు 352 స్థానాలు కేటాయించారు. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లాలో బీసీలకు 20.98 శాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కాయి. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఆధారంగా తీసుకున్నప్పటికీ బీసీలకు రిజర్వేషన్లు తక్కువగా వచ్చాయనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి బీసీలకు ప్రస్తుతం విద్య, రాజకీయ, ఇతర రంగాల్లో 24 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అంతకంటే తక్కువ రావడంతో ఆందోళన నెలకొంది. అత్యధికంగా గద్వాలలో 27.50 శాతం రిజర్వేషన్లు బీసీలకు రాగా.. నారాయణపేట జిల్లాలో 26.47, వనపర్తిలో 23.50, మహబూబ్‌నగర్‌లో 20.33 శాతం రిజర్వేషన్లు దక్కాయి. తక్కువ సర్పంచు స్థానాలు ఉన్న వనపర్తి, గద్వాల, నారాయణపేటలలో బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్ ప్రకారం కేటాయింపులు ఉండగా.. ఎక్కువ స్థానాలు ఉన్న మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలో అంతకంటే తక్కువ శాతం సీట్లు దక్కాయి. నాగర్‌కర్నూల్‌లో కేవలం 13.26 శాతం మాత్రమే రిజర్వేషన్లు దక్కాయి. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీల జనాభా ఎక్కువగా ఉండటంతో వారికి బీసీల కంటే ఎక్కువ సీట్లు కేటాయించారు.
ఎస్టీలకు కలిసొచ్చిన 100 శాతం జీపీలు..
గత ప్రభుత్వ హయాంలో తండాలను పంచాయతీలు చేసి.. చట్టంలో 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీల్లో వారికే రిజర్వేషన్ కల్పించాలని పొందుపర్చారు. దాని ప్రకారం ఎస్టీలకు ఉమ్మడి జిల్లాలో 319 స్థానాలు రిజర్వు అయ్యాయి. మొత్తం సీట్లలో 19.01 శాతం వారికి దక్కింది. అయితే జనాభాలో ఎస్టీలకు కంటే ఎక్కువ శాతం ఉన్న ఎస్సీలకు 278 స్థానాలతో 16.57 శాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కాయి. అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 1,678 స్థానాల్లో మహిళలకు 769 స్థానాలు కేటాయించారు. మహిళలకు 45.83 శాతం రిజర్వేషన్లు కల్పించారు. వారికి స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే నిబంధన మేరకు నిర్ణయం తీసుకున్నారు. 729 స్థానాలు అన్ రిజర్వ్‌డ్‌కు కేటాయించగా.. 43.44 శాతం జనరల్ కేటగిరీలో ఉంది. ఇందులో ఏ కేటగిరి వారైనా పోటీ చేయొచ్చు. అన్ రిజర్వ్‌డ్ కేటగరీలోనే ఇప్పుడు బీసీలకు ఎంత శాతం పార్టీపరంగా ఇస్తారనే విషయంపై నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కాకపోవడంతో కేవలం మద్దతుదారులను మాత్రమే నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ గ్రామాల్లో మాత్రం పార్టీల వారిగానే ప్రచారం జరుగుతుందనడంలో సందేహం లేదు.