Share News

తపాలా శాఖలో ‘ఐటీ -2.0’

ABN , Publish Date - Jul 17 , 2025 | 11:19 PM

తపాలా శాఖ నూతన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. వినియోగదారులకు సురక్షిత సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

తపాలా శాఖలో ‘ఐటీ -2.0’
మహబూబ్‌నగర్‌ తపాలా శాఖ ప్రధాన కార్యాలయం

- 22వ తేదీ నుంచి కొత్త సాఫ్ట్‌వేర్‌ అమలు

- 19, 21వ తేదీల్లో సేవలకు అంతరాయం

మహబూబ్‌నగర్‌ టౌన్‌/నారాయణపేట, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : తపాలా శాఖ నూతన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. వినియోగదారులకు సురక్షిత సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా పోస్టల్‌ సూపరింటెండెంట్‌ విజయజ్యోతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తపాలా శాఖ కార్యాలయాల సేవలన్నింటినీ ఒకే ప్లాట్‌ ఫామ్‌పై అమలు చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఐటీ - 2.0 పేరుతో నూతన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ సాఫ్ట్‌వేర్‌ తపాలా సమాచారం భద్రతను పెంచుతుందని చెప్పారు. ఉద్యోగుల పని సామర్థ్యం, నైపుణ్యం పెరగడమే కాకుండా, వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయి.

తెలంగాణ సర్కిల్‌ వ్యాప్తంగా..

తపాలా శాఖ నూతన యాప్‌ ఐటీ-2.0ను ఈ నెల 22వ తేదీ నుంచి తెలంగాణ సర్కిల్‌ వ్యాప్తంగా అమలు చేయనున్నది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంతో పాటు, మన రాష్ట్రంలోని హైదరాబాద్‌ సర్కిల్‌, నల్లగొండ తపాలా డివిజన్‌లో అమలు చేస్తున్నారు. ఈ నెల 22 నుంచి రాష్ట్రం అంతటా అమలు చేయనున్నారు. మహబూబ్‌నగర్‌ తపాలా డివిజన్‌ పరిధిలోని కార్యాలయాల్లో మహబూబ్‌నగర్‌, జోగుళాంబ గద్వాల ప్రధాన కార్యాలయాలు, 4 సబ్‌ డివిజన్ల (మహబూబ్‌నగర్‌ ఈస్ట్‌, వెస్ట్‌, నారాయణపేట, గద్వాల) పరిధిలోని 368 బ్రాంచ్‌ పోస్ట్‌ ఆఫీసుల్లో ఐటీ 2.0 సేవలు అందుబాటులోని రానున్నాయి. వీటితో పాటు 42 ఉప త పాలా కార్యాలయాల్లో నూతన యాప్‌ను అమలు చేయనున్నారు. అందుకోసం ఇప్పటికే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు సూపరింటెండెంట్‌ విజయజ్యోతి తెలిపారు. కొత్త సాంకేతిక విధానాన్ని ప్రవేశపెడుతున్నందున ఈ నెల 19, 21 తేదీల్లో తపాలా సేవలను నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని వినియోగదారులు, ఖాతా దారులు గమనించాలని కోరారు. 22వ తేదీ నుంచి నూతన సాంకేతిక సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

Updated Date - Jul 17 , 2025 | 11:19 PM