పోలీసు ప్రజావాణికి 15 వినతులు
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:17 PM
పోలీస్ ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : పోలీస్ ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీ వారం 15-20 ఫిర్యాదులు అందుతున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్‌లలో న్యాయం జరగని బాధితులు నేరుగా ఎస్పీని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. స్థానికంగా రాజకీయ నాయకుల ఒత్తిడి, పైరవీలు, ఆర్థిక కారణాల వల్ల సామాన్య జనాలకు న్యాయం జరగడం లేదన్న విషయం స్పష్ఠమవుతోంది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా 15 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చిన ఎస్పీ సంబందిత పోలీస్‌స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.
బాధిత మహిళలకు అండగా ఉండాలి
మహిళలు, బాలబాలికలకు అండగా నిలబడి వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత భరోసా సెంటర్‌పై ఉంటుందని ఎస్పీ జానకి అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో భరోసా, షీటీం, మానవ అక్రమ రవాణా నియంత్రణ బృందాలతో సమీక్ష నిర్వహించి, మాట్లాడారు. మహిళలు, విద్యార్థులపై వేధింపులు జరగకుండా, ర్యాగింగ్ నిరోధక చర్యలు తీసుకోవాలన్నారు. ఫొక్సో చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. మానవ అక్రమ రవాణా, వ్యభిచారం, అక్రమ గర్భస్రావాలు, బాలకార్మిక వ్యవస్థ, పసిపిల్లల కొనుగోలు, అవయవాల వ్యాపారం జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు.