Share News

పోలీస్‌ ప్రజావాణికి 13 ఫిర్యాదులు

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:25 PM

ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ జానకి అన్నారు.

పోలీస్‌ ప్రజావాణికి 13 ఫిర్యాదులు
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ జానకి

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎస్పీ జానకి అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 13 పిర్యాదులు రాగా, బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్‌ అధికారులకు ఫోన్‌ చేసి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆకతాయిలపై షీటీం నిఘా : ఎస్పీ

ఆకతాయిల ఆగడాలకు అడ్డకట్ట వేయడానికి షీటీం అంకితభావంతో పనిచేస్తున్నాయని ఎస్పీ జానకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే హాట్‌స్పాట్‌లను గుర్తించి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలు, బాలికలు, విద్యార్థినుల రక్షణకు షీటీం పనిచేస్తున్నాయని, రద్దీ ప్రదేశాలు, విద్యాసంస్థల వద్ద షీటీం సివిల్‌ డ్రెస్‌లో ఉంటారన్న విషయాన్ని పోకిరీలు గమనించాలన్నారు. ఆగస్టు నెలలో జిల్లాలో 25 ఫిర్యాదులు రాగా, అందులో 13 మందికి కౌన్సిలింగ్‌, 11 మందిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడం, 3 ఈవ్‌ టీజింగ్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 25 అవగాహన కార్యక్రమాలు, 70 హాట్‌స్పాట్‌ విజిట్స్‌ నిర్వహించామని వివరించారు. పోకిరీలను అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ చేశామని పేర్కొన్నారు.

జిల్లాలో 30 పోలీసు చట్టం..

జిల్లాలో ఈనెల 30 వరకు 30 పోలీసు చట్టం అమలులో ఉందని ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతులు లేనిదే సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి వీలు లేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఏఎస్‌ఐకి అభినందనలు..

యోగాసనాలలో ప్రతిభ కనబరిచిన ఏఎస్‌ఐ వనజను ఎస్పీ జానకి అభినందించారు. ఆగస్టు నెలలో ఆదిలాబాద్‌ జిల్లాలో తెలంగాణ యోగాసన అసోసియేషన్‌ తరపున నిర్వహించన 6వ రాష్ట్ర స్థాయి సీనియర్‌ యోగాసన స్పోర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌ 2025 నందు ట్విస్టింగ్‌ బాడీ, ఫార్వర్డ్‌ బెండింగ్‌ ఈవెంట్‌లో మొదటిస్థానం సాధించినందుకు సోమవారం అభినందించారు.

Updated Date - Sep 01 , 2025 | 11:25 PM