ప్రైవేటు ఆసుపత్రుల్లో పదో తరగతి ఫార్మసిస్టులు!
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:21 PM
ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.
- అసలు ఫార్మసిస్టులు లైసెన్సులకే పరిమితం
- ప్రజల ప్రాణాలతో యజమానుల చెలగాటం
- పట్టంచుకోని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు
మహబూబ్‌నగర్(వైద్యవిభాగం) సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అందుకు వారు నిర్వహించే మెడికల్ దుకాణాలే ఉదాహరణ. కోట్ల రూపాయలు పెట్టి ఆసుపత్రులు ఏర్పాటు చేసుకొని, వేలకు వేలు ఫీజులు వసూలు చేయడమే కాకుండా, ఫార్మసిస్టులు లేకుండా మెడికల్ దుకాణాలను నడిపిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్ చదివే విద్యార్థులను తక్కువ జీతానికి పనిలో పెట్టుకుంటున్నారు. వారితోనే యాంటిబయోటిక్స్, ఇతర మందులు ఇప్పిస్తున్నారు. ఫార్మసీ లైసెన్సు ఉన్న వారి సర్టిఫికెట్లను అద్దెకు తీసుకొని అనర్హులతో మెడికల్ దుకాణాలను కొనసాగిస్తున్నారు. అయితే ప్రతీ తనిఖీలు చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవలసిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు అటువైపు కూడా చూడటం లేదన్న విమర్శలున్నాయి.
200కు పైగా ప్రైవేటు ఆసుపత్రులు
మహబూబ్‌నగర్ జిల్లాలో 200లకు పైగా ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. అందులో జిల్లా కేంద్రంలోనే దాదాపు 105 వరకు ఆసుపత్రులున్నాయి. వాటిలో ఒక్క ఆసుపత్రిలోని మెడికల్ షాపుల్లో కూడా ఫార్మసిస్టులు లేరు. అన్ని ఆసుపత్రుల్లో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులే ఫార్మసిస్టులుగా చెలామణి అవుతున్నారు. మరికొన్ని చోట్ల నర్సింగ్ విద్యార్థులు, లేదా వేరే మెడికల్ షాపుల్లో పని చేసిన అనుభవం ఉన్న వారిని ఫార్మసిస్టులుగా నియమించుకుంటున్నారు. వాస్తవానికి ఫార్మసిస్టు లేకుండా ఎలాంటి మందులూ ఇవ్వడానికి వీలు లేదు. కానీ ఆ నిబంధనలను ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు పట్టించుకోవడం లేదు.
బినామీ పేర్లతో దుకాణాలు
ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉండే మెడికల్ దుకాణాలు బినామీ పేర్లతో నడుస్తున్నాయి. ప్రతీ షాపులో బి-ఫార్మసీ, డి-ఫార్మసీ చేసిన వారి పేరు మీద లైసెన్సులు తీసుకొని దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. పేరుకు మాత్రమే ఫార్మసీ సర్టిఫికెట్ ఉంటుంది. కానీ అర్హత లేని వారితో దుకాణాలను కొనసాగిస్తున్నారు.
వాటిల్లో మచ్చుకు కొన్ని...
జిల్లాకేంద్రంలోని నిలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రిలో చెన్నకేశవ మెడికల్ పేరుతో లైసెన్సు ఉంది. కాని ఆ ఫార్మసిస్టు ఒక్కసారి కూడా దుకాణంలో ఉండరు. దుకాణం యజమాని అల్లుడు, ఇంటర్ చదువుతున్న విద్యార్థి, అలాగే డిగ్రీ చదువుతున్న కుమార్తె షాపులో ఉంటూ మందులు ఇస్తున్నారు.
- సాయిశిల్ప ఆసుపత్రిలో ఓ పేరున్న మెడికల్ దుకాణం యాజమాని కుమార్తె పేరుతో లైసెన్సు తీసుకొని నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అర్హతా లేని వ్యక్తిని ఫార్మసిస్టుగా పెట్టుకున్నారు. అతడితో పాటు, మరో పదవ తరగతి చదువుతున్న బాలుడు మందులు ఇస్తున్నారు.
- బాయమ్మతోటలో ఎలాంటి విద్యార్హతలు, లైసెన్సు లేకుండా మెడికల్ దుకాణం నడిపిస్తున్నారు. పైగా తాను బీహెచ్‌ఎంఎస్ చదివానని, సర్టిఫికెట్‌ను రిజిస్టర్ చేసుకోలేదని చెప్తున్నాడు. అంతేకాకుండా అనుమతి లేకుండా క్లీనిక్‌ను కూడా కొనసాగిస్తున్నాడు.
- పట్టణంలోని పాత డీఈవో ఆఫీసు చౌరస్తాలో కూడా శ్రావణి ఆసుపత్రిలోనూ ఎలాంటి విద్యార్హతలు లేని వ్యక్తి ఫార్మసీని నడిపిస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
విశ్వంత్‌రెడ్డి, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ : మెడికల్ షాపులను తనిఖీ చేస్తున్నాం. ఫార్మసిస్టులు లోని దుకాణాల యజమానులకు నోటీసులు ఇచ్చాం. ఇకపై ప్రైవేటు ఆసుపత్రుల్లోని మెడికల్ దుకాణాలను కూడా తనిఖీ చేస్తాం. నిబంధనలు వారిపై చర్యలు తీసుకుంటాం.