రూ.100కు 10 కిలోలు
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:00 PM
ఉల్లి ధర గణనీయంగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- గణనీయంగా పడిపోయిన ఉల్లి ధర
- అగ్గువకు అమ్ముకుంటున్న కొందరు రైతులు
- పొలాల్లోనే వదిలేస్తున్న మరి కొందరు
అయిజ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఉల్లి ధర గణనీయంగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. కొంత కాలంగా కురుస్తున్న వర్షాలతో ఉల్లి పంట దెబ్బతిని దిగుబడి గణనీయంగా తగ్గింది. అంతో ఇంతో వచ్చిన ఉల్లిని అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర దక్కక దిగులు పడుతున్నారు. పంట తీసి మార్కెట్లో అమ్ముకునే కంటే పొలంలోనే వదిలి పెట్టడం, లేదా కలియదున్నడం తప్ప మరో మార్గం లేదని వాపోతున్నారు. కొందరు రైతులు ఉల్లిని సంచుల్లో నింపి వాహనాల్లో తీసుకెళ్లి, ప్రజలకు అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
ఎకరం సాగుకు రూ. 70 వేలు
జోగుళాంబ గద్వాల జిల్లాలో అయిజ, రాజోలి, ఉండవల్లి మండలాల్లో ఎక్కువ మంది రైతులు ఉల్లి సాగు చేస్తారు. ఉండవల్లి మండలం మారుమునగాలకు చెందిన రైతు చిన్న శ్రీనివాసులు 3 ఎకరాల్లో ఉల్లి పంట సాగుచేశారు. అందుకోసం ఎకరానికి రూ. 70 వేల వరకు ఖర్చు చేశారు. తీరా మార్కెట్లో ఉల్లి ధర పడిపోయినట్లు తెలుసుకొని, గొర్రెలకు మేతగా వదిలివేశారు. అయిజ మండలంలోని యాపదిన్నెకు చెందిన వెంకటేశ్ పొలంలోనే ఉల్లి మురిగిపోతుండటంతో అయిజ - కర్నూల్ రహదారి సమీపంలో, పెద్ద వాగు పక్కన పారబోశారు. రాజోలి మండలానికి చెందిన శేఖర్ ఉల్లి పంటను మార్కెట్‌లో విక్రయించినా ఆశించిన ధర రాదని తెలిసి, తమ పొలం నుంచి ఉచితంగా తీసుకెళ్లాలని స్థానికులను కోరారు. దీంతో పలువురు పొలానికి వెళ్లి ఉల్లిగడ్డను సంచుల్లో నింపుకొని తీసుకెళ్లారు. దీనికి తోడు కర్ణాటక, రాయలసీమకు చెందిన వారు ఆటోల్లో ఉల్లిగడ్డలను తెచ్చి స్థానికంగా విక్రయిస్తుండటంతో ధర మరింతగా తగ్గిపోయింది.
మార్కెటింగ్ సౌకర్యం లేక ఇక్కట్లు
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఉల్లి రైతులకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవటం ప్రధాన సమస్యగా మారింది. స్థానికంగా పండించిన ఉల్లిని విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూర్, కర్ణాటకలోని రాయిచూర్‌కు లేదా హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఆయా మార్కెట్లలో ప్రస్తుతం క్వింటాలకు రూ. 400 నుంచి రూ. 500 వరకు ధర పలుకుతోంది. ఉల్లి ఏరేందుకు కూలీల ఖర్చు, దీనికి తోడు రవాణా వ్యయం రైతులకు భారంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఉల్లిని మార్కెట్‌కు తరలించడం కంటే స్థానికంగా అగ్గువకు అమ్ముకోవడమే మేలని భావిస్తున్నారు.
పారబోయలేక ఉచితం
శేఖర్, రైతు, రాజోలి : ఉల్లికి గిట్టుబాటు ధర రాకపోవడంతో పొలంలోనే వదిలేశాను. ఉచితంగా తీసుకెళ్లాలని ప్రజలను కోరాను. పొలంలో వృథాగా కుళ్లిపోవడం కంటే జనం వినియోగించుకుంటే కొంత పుణ్యం అయినా వస్తుందనిపించింది. ప్రభుత్వం స్పందించి ఉల్లి రైతులను ఆదుకోవాలి.