Share News

Domestic Violence: పచ్చని కాపురంలో ఇన్‌స్టా చిచ్చు

ABN , Publish Date - Sep 02 , 2025 | 02:22 AM

పదమూడేళ్ల క్రితం ప్రేమ వివాహం.. భర్తతో 13 ఏళ్ల బంధం.. ముగ్గురు పిల్లలు! ఇవన్నీ దిగదుడుపు అనుకుంది ఆ వివాహిత. ఎందుకు? ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి కోసం!

Domestic Violence: పచ్చని కాపురంలో ఇన్‌స్టా చిచ్చు

  • నెట్‌లో పరిచయమైన వ్యక్తి కోసం భర్త, ముగ్గురు పిల్లలను వదులుకునేందుకు సిద్ధపడిన భార్య

  • విడాకులిచ్చేస్తానంటూ ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు యత్నం

  • తట్టుకోలేక భార్య గొంతుకోసి, మణికట్టు కోసుకున్న భర్త

  • జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో ఘటన.. భార్య పరిస్థితి విషమం

హైదరాబాద్‌సిటీ/జీడిమెట్ల, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పదమూడేళ్ల క్రితం ప్రేమ వివాహం.. భర్తతో 13 ఏళ్ల బంధం.. ముగ్గురు పిల్లలు! ఇవన్నీ దిగదుడుపు అనుకుంది ఆ వివాహిత. ఎందుకు? ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి కోసం! ‘నీకు విడాకులైనా ఇస్తాను తప్ప, ఆ వ్యక్తిని నేను వదులుకోను’ అని భర్తకు ఆమె స్పష్టం చేసింది. ఇది తట్టుకోలేని ఆ భర్త విచక్షణ కోల్పోయి కత్తితో ఆమె గొంతు కోశాడు. తర్వాత తన మణికట్టు కోసుకున్నాడు. జగద్గిరిగుట్టలో జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకొచ్చింది. సీఐ నరసింహ వెల్లడించిన వివరాల ప్రకారం.. వాసాల శ్రీధర్‌ (34), కల్యాణి (33) భార్యాభర్తలు. శ్రీధర్‌ది కరీంనగర్‌ జిల్లా. కల్యాణిది ఖమ్మంజిల్లా. వీరిది ప్రేమ వివాహం. ఓ రాంగ్‌ ఫోన్‌కాల్‌ ద్వారా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పలేదు. శ్రీధర్‌-కల్యాణి దంపతులకు 11 ఏళ్లు, తొమ్మిదేళ్లు, ఏడేళ్ల వయసున్న ముగ్గురు కుమారులున్నారు. బతుకుదెరువు కోసం పిల్లలతో హైదరాబాద్‌కొచ్చిన ఈ దంపతులు, జగద్గిరిగుట్టలోని ఎల్లమ్మబండ, పీజేఆర్‌నగర్‌లో నివాసముంటున్నారు.


కల్యాణి ఇంటివద్దే ఉంటూ పిల్లలను చూసుకుంటోంది. భర్త ప్రైవేటు ఉద్యోగి. ఇన్‌స్టాగ్రామ్‌లో చురు గ్గా ఉండే కల్యాణికి కొన్నాళ్లుగా ఏపీలోని కర్నూలుకు చెందిన వ్యక్తితో ఆ వేదికగా పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. నిత్యం అతడితో ఆమె ఫోన్లో మాట్లాడుతోంది. ఇది గమనించిన శ్రీధర్‌, ఆమెను నిలదీశాడు. ఇది మంచి పద్ధతి కాదని, మారాలని పలుమార్లు సూచించాడు. భర్త మాటలను ఆమె లెక్క చేయలేదు. ఆ వ్యక్తితో మాటలు కొనసాగించింది. ఫలితంగా శ్రీధర్‌, కల్యాణి మధ్య గొడవలు మొదలయ్యాయి. విడాకులిచ్చేస్తానని భర్తను కల్యాణి హెచ్చరించింది. పంచాయతీ పెద్దల దాకా వెళ్లడంతో వారు సర్దిచెప్పినా.. ప్రవర్తన మార్చుకోని కల్యాణి.. భర్త, పిల్లలను వదులుకునేందుకే సిద్ధపడింది. దీంతో సోమవారం ఉదయం భార్యాభర్తల మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఇళ్ల వదిలి వెళ్లడానికి సిద్ధపడిన కల్యాణిపై శ్రీధర్‌ కత్తితో దాడి చేశాడు. ఆమెకు గొంతు, మణికట్టు, మొహంపై గాయాలయ్యాయి. ఆ తర్వాత శ్రీధర్‌ రెండు చేతుల మణికట్టుల వద్ద కోసుకొని కింద పడిపోయాడు. భర్తను కాపాడాలని అరుస్తూ కల్యాణి ఇంట్లోంచి బయటకు పరుగెత్తింది. ఇంటి పక్కన ఉంటున్న ఓ వ్యక్తి స్పందించి.. ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాడు. కల్యాణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదైంది.

Updated Date - Sep 02 , 2025 | 02:22 AM