పత్తి కొనడం లేదని రైతుల రాస్తారోకో
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:29 PM
సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయడం లేదంటూ మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు సోమవారం రాస్తారోకో చేపట్టారు. చెన్నూరు-మంచిర్యాల ప్రధాన రహదారి చెన్నూరు కాటన్ మిల్లు వద్ద రోడ్డుపై బైఠాయించారు.

చెన్నూరు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయడం లేదంటూ మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు సోమవారం రాస్తారోకో చేపట్టారు. చెన్నూరు-మంచిర్యాల ప్రధాన రహదారి చెన్నూరు కాటన్ మిల్లు వద్ద రోడ్డుపై బైఠాయించారు. సీపీఐ అధికారుల తీరును ఎండగడుతూ దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో చేయడంతో ఎటు వాహనాలు అటే నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 20 రోజుల నుంచి పత్తిని కొనుగోలు చేయడం లేదన్నారు. మూడు రోజుల క్రితం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్టణంలోని పత్తి మిల్లులను సందర్శించి పత్తి కొనాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో రెండు రోజుల పాటు కొనుగోళ్లు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. లేని పోని ఆంక్షలు విధిస్తూ పై నుంచి పత్తి కొనుగోలు చేసే ఆదేశాలు రాలేదంటూ అలసత్వం వహిస్తున్నారని రైతులు వాపోయారు. రోజుల తరబడి ఇక్కడే ఉంటూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులు, అధికారులతో సంప్రదింపులు జరిపి ధర్నాను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.