Land Compensation: ఎకరాకు రూ.20- 27లక్షల పరిహారం
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:37 AM
నాగపూర్- విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూపాలపల్లి జిల్లాలో నెలకొన్న అడ్డంకులు తొలగిపోయాయి.

నాగ్‌పూర్- విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు భూపాలపల్లి జిల్లాలో 322.20 ఎకరాల భూసేకరణకు మార్గం సుగమం
(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి): నాగపూర్- విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూపాలపల్లి జిల్లాలో నెలకొన్న అడ్డంకులు తొలగిపోయాయి. జిల్లాలో 322.20 ఎకరాల భూసేకరణకు మార్గం సుగమం అయింది. భూసేకరణకు ప్రతిబంధకంగా మారిన నష్టపరిహారం విషయం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఒక్కో ఎకరాకు రూ.20 లక్షల నుంచి రూ.27 లక్షల దాకా నష్ట పరిహారం ఇచ్చేందుకు జాతీయ రహదారుల సంస్థ అంగీకరించింది. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మధ్యవర్తిత్వంతో ముందుగా ప్రకటించిన పరిహారాన్ని మూడు రెట్ల మేర పెంచింది. దీంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను కలిపే ఈ ఎకనామిక్ కారిడార్‌లో.. మంచిర్యాల జిల్లా జైపూర్ నుంచి ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం వరకు 216 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి జాతీయ రహదారుల విభాగం పనులు ప్రారంభించింది. తెలంగాణ సరిహద్దు ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి నుంచి మంచిర్యాల వరకు బ్రౌన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణ పనులను ఇప్పటికే పూర్తిచేసింది.
అయితే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ గ్రామం నుంచి వరంగల్ వరకు 108 కిమీల రహదారి నిర్మాణానికి అవసరమైన 589హెక్టార్ల భూసేకరణకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఇందులో భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల, మొగుళ్ళపల్లి మండలాలకు సంబంధించిన 14 గ్రామాల్లోని 322.20 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. తొలుత ఎకరాకు రూ.3లక్షల నష్టపరిహారం నిర్ణయించడంతో భూమి ఇచ్చేందుకు రైతులు నిరాకరించారు. భూమికి బదులు భూమి లేదంటే అలైన్‌మెంట్ మార్చాలంటూ ఆందోళనలకు దిగారు. గత ఆగస్టులో అప్పటి కలెక్టర్ అవార్డు పెంపు కోసం ఆర్బిట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. దీంతో చాలామంది దరఖాస్తు చేశారు. తొలుత పరిహారం పెంపునకు నిరాకరించిన జాతీయ రహదారుల విభాగం ఆ తర్వాత అంగీకరించింది. గతంలో నిర్ణయించిన భూమి విలువను రెట్టింపు చేసి దానికి మూడు రెట్ల పరిహారం, నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి 12శాతం వడ్డీతో కలుపుకొని పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది. భూమి రిజిస్ట్రేషన్ విలువ, స్వభావం ప్రకారం పరిహారాన్ని ఎకరాకు రూ.20 లక్షలు, రూ.25 లక్షలు, రూ.27లక్షలని మూడు క్యాటగిరీలుగా విభజించింది. పరిహారం పెరగడంతో రైతులు భూమి ఇచ్చేందుకు ముందుకొస్తుండగా చెక్కుల పంపిణీ కూడా ప్రారంభమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొత్తం మూడు మండలాల్లో 14గ్రామాలకు చెందిన 515 మంది రైతులు 322.20 ఎకరాల భూములకు గాను రూ.77.20 కోట్లు పరిహారం అందుకొనున్నారు.