Share News

KTR Rejects Congress: అప్పుపై కాంగ్రెస్‌వి పచ్చి అబద్ధాలు

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:08 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి, ఆయన బృందం చేసిన ఆరోపణలు పచ్చి......

KTR Rejects Congress: అప్పుపై కాంగ్రెస్‌వి పచ్చి అబద్ధాలు

  • ఇదే విషయం పార్లమెంట్‌ సాక్షిగా తేలిపోయింది

  • బీఆర్‌ఎస్‌ హయాంలో అప్పు 8 లక్షల కోట్లు కాదు.. 3.5 లక్షల కోట్లే

  • మేం అప్పులు చేసి ఆస్తులు సృష్టిస్తే.. ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్‌ ఖతం చేసింది

  • కాగ్‌ నివేదికతో రాష్ట్ర ఆర్థికస్థితి తలకిందులైందని స్పష్టీకరణ

  • అప్పులతో ఏం చేస్తున్నారు? ? కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి, ఆయన బృందం చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అనే సంగతి పార్లమెంటులో తేలిపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు కాంగ్రెస్‌, బీజేపీలు ఆరోపిస్తున్నట్టుగా తమ హయాంలో రాష్ట్ర అప్పు రూ.8 లక్షల కోట్ల కాదని, రూ.3.5 లక్షల కోట్లు మాత్రమే అన్న నిజాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఒప్పుకొందన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి రూ. 8 లక్షల కోట్ల అప్పులంటూ నిరాధార ప్రచారానికి దిగిన రేవంత్‌ రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.


సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అస్తుల సృష్టి కోసమే తెచ్చిన అప్పులను తాము ఉపయోగించామని చెప్పారు. మిషన్‌ భగిరథ, మిషన్‌ కాకతీయ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ నిధులను ఖర్చు చేశామన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ అప్పులు రూ. 3,50,520.39 కోట్లు అయితే, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల విలువ రూ. 4,15,099.69 కోట్లుగా ఉందన్నారు. అంటే, అప్పుల కంటే ఆస్తుల విలువ రూ. 64,579 కోట్లు ఎక్కువగా ఉందని తెలిపారు. తమ హయాంలో చివరిఆరు ఆర్థిక సంవత్సరాల్లో ఏటా రాష్ట్ర అప్పుల కంటే ఆస్తుల విలువ రూ. 50 వేల కోట్లకు పైగా పెరిగిందన్నారు. రేవంత్‌ రెడ్డి, తాను సీఎం అయినప్పటి నుంచి విపరీతంగా అప్పులు చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. 2023 డిసెంబరు నుంచి వివిధ మార్గాల ద్వారా రూ. 1.5 లక్షల కోట్లకు మించి అప్పులు చేసినట్లు స్వయంగా రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో అంగీకరించారని పేర్కొన్నారు. రేవంత్‌ ప్రభుత్వ అనాలోచిత, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ ఫలితంగానే తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోందన్నారు. ఆరు గ్యారెంటీల అమలు సంగతేమో కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖతం చేసిందని మండిపడ్డారు. కంపో్ట్ర అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం పడిపోవడంతో పాటు అప్పులు భారీగా పెరిగాయన్నారు. మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ, ఇప్పుడు 10,583 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కోవడం కాంగ్రెస్‌ అసమర్థ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. పన్నేతర ఆదాయం కూడా దారుణంగా పడిపోయిందని, బడ్జెట్‌లో అంచనా వేసిన దానిలో కేవలం 3.37 శాతం మాత్రమే వసూలైందని తెలిపారు. కొత్తగా ఏ రోడ్డూ వేయకుండా, ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించకుండా, విద్యార్థులకు కనీసం మంచి భోజనమైనా పెట్టకుండా తెచ్చిన అప్పులను ఏం చేస్తున్నారు? ఆ నిధులు ఎటు వెళుతున్నాయి? అని నిలదీశారు.

Updated Date - Aug 12 , 2025 | 06:08 AM