KTR: సౌదీ అరేబియాలో మరణించిన పార్టీ కార్యకర్త కుటుంబానికి కేటీఆర్ అండ
ABN , Publish Date - Jun 06 , 2025 | 03:50 AM
బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లి.. అక్కడ గుండెపోటుతో అకాల మరణం చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త విస్లావత్ బాబ్య కుటుంబానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు.
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లి.. అక్కడ గుండెపోటుతో అకాల మరణం చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త విస్లావత్ బాబ్య కుటుంబానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని హేమ్లానాయక్ తండాకు చెందిన విస్లావత్ గత నెల 27న సౌదిలో మృతి చెందాడు. అక్కడి కఠిన నిబంధనల కారణంగా మృతదేహాన్ని సొంతూరుకు రప్పించడంలో కుటుంబసభ్యులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కేటీఆర్ దృష్టికి తెచ్చారు. దీంతో విదేశాంగ అధికారులతో మాట్లాడి.. మృతదేహాన్ని భారత్‌కు రప్పించేలా కృషి చేశారు. కేటీఆర్ చొరవతో విస్లావత్ బాబ్య మృతదేహం బుధవారం రాత్రి స్వగ్రామానికి చేరడంతో గురువారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు జరిపించినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.