KTR: 22న చెన్నై సమావేశానికి వెళ్తాం
ABN , Publish Date - Mar 14 , 2025 | 05:31 AM
జనాభా ఆధారంగా కేంద్రం చేపట్టదలచిన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

బీఆర్‌ఎస్ వాదనను బలంగా వినిపిస్తాం
నియోజకవర్గాల పునర్విభజనతో ‘దక్షిణాది’కి అన్యాయం: కేటీఆర్
కేటీఆర్‌ను కలిసిన డీఎంకే బృందం
హైదరాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): జనాభా ఆధారంగా కేంద్రం చేపట్టదలచిన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ అంశంపై కార్యాచరణ రూపొందించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన ఈ నెల 22న చెన్నైలో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొంటామని తెలిపారు. డీఎంకే ప్రతినిధులు గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. చెన్నైలో నిర్వహించే సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు పాల్గొనాలని తమిళనాడు మంత్రి కె.ఎన్.నెహ్రూ, ఎంపీ ఎన్.ఆర్.ఇళంగో, ఇతర నేతలు ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనుకోవడం దారుణమని చెప్పారు.
స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించే సమావేశానికి బీఆర్‌ఎస్ తరఫున హాజరు కావాలని కేసీఆర్ ఆదేశించారన్నారు. ఇందులో పాల్గొని తమ పార్టీ వాదాన్ని బలంగా వినిపిస్తామని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సమష్టిగా పోరాడితే తప్పకుండా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 1970-80ల్లో కుటుంబ నియంత్రణ బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ స్థానాలను కొత్త జనాభా లెక్కల ప్రకారం నిర్ణయిస్తామనడం అన్యాయమని చెప్పారు. దీనివల్ల పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని కేటీఆర్ తెలిపారు. అనంతరం డీఎంకే ప్రతినిధులు మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారన్నారు. అందులో భాగంగా దక్షిణాదిలోని అన్ని పార్టీలతో చెన్నైలో భేటీ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.