Share News

KTR: కాంగ్రెస్‌ రౌడీయిజాన్ని సహించం

ABN , Publish Date - Nov 16 , 2025 | 05:48 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం వెలువడి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్‌ పార్టీ రౌడీయిజానికి దిగి.. దిగజారుడు రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

KTR: కాంగ్రెస్‌ రౌడీయిజాన్ని సహించం

  • గెలిచిన 24 గంటల్లోనే మా కార్యకర్తపై దాడి .. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలి: కేటీఆర్‌

  • దాడిలో గాయపడ్డ బీఆర్‌ఎస్‌ కార్యకర్తకు పరామర్శ

  • ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. ధైర్యంగా ఉండాలి

  • మాగంటి సునీత కుటుంబసభ్యులతో కేటీఆర్‌

  • రిగ్గింగ్‌ చేసి గెలిచారు: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌

హైదరాబాద్‌ సిటీ/బోరబండ/హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం వెలువడి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్‌ పార్టీ రౌడీయిజానికి దిగి.. దిగజారుడు రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. శుక్రవారం రాత్రి రహ్మత్‌నగర్‌ డివిజన్‌కు చెందిన తమ కార్యకర్త రాకేశ్‌ క్రిస్టోఫర్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారని తెలిపారు. కాంగ్రెస్‌ గూండాయిజాన్ని సహించబోమని, తమ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. శనివారం ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జూబ్లీహిల్స్‌ అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి రాకేశ్‌ క్రిస్టోఫర్‌ను కేటీఆర్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ కార్యకర్తపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పదేళ్లు తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉందని, ఏనాడైనా తమ కార్యకర్తలు హద్దులు దాటి ప్రవర్తించారా? అని ప్రశ్నించారు. ఈ దాడికి కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఇలా కక్షపూరితంగా రౌడీయిజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌ నేతలు రిగ్గింగ్‌లు, గుండాగిరి, దొంగ ఓట్లు, పైసలు, చీరలు, కుక్కర్లు పంచినా తమ అభ్యర్థికి 75 వేల ఓట్లు వచ్చాయని, ఇది స్వల్ప సంఖ్యకాదని అన్నారు. ఈ నెల 18 జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామన్నారు. భవిష్యత్తులో జూబ్లీహిల్స్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తామన్నారు. కాగా.. దాడి ఘటనపై రాకేశ్‌ క్రిస్టోఫర్‌ ఫిర్యాదు మేరకు రాఖీ అనే యువకుడితోపాటు అతని అనుచరులపై కేసు నమోదు చేసినట్లు మధురానగర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌ తెలిపారు.


రేవంత్‌ పాలనకు ఆమోదం కాదు..

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలుపు సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు ప్రజల ఆమోదం కాదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ అన్నారు. బిహార్‌, రాయలసీమ, పాతబస్తీలో జరిగినట్లు జూబ్లీహిల్స్‌లోనూ రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో అదికార పార్టీ గెలవడం సర్వసాధారణమన్నారు. గతంలో కాంగ్రెస్‌ అనేక ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిందని గుర్తు చేశారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పనిచేసి రూ.200 కోట్లు ఖర్చుపెట్టి ఎంఐఎంను బతిమిలాడి గెలిచారని విమర్శించారు. ఈ ఎన్నికలో ఓడిపోతే రేవంత్‌రెడ్డి సీఎం పదవి పోతుందని భయపడ్డారని ఎద్దేవా చేశారు. ప్రజలు నవీన్‌యాదవ్‌ను చూసి ఓటు వేశారే తప్ప.. రేవంత్‌ను చూసి కాదన్నారు. బండి సంజయ్‌తో కుమ్మక్కయి బీజేపీ ఓట్లు కాంగ్రెస్‌కు వేయించుకుని గెలిచారని ఆరోపించారు.

మాగంటి సునీత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేటీఆర్‌

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన మాగంటి సునీత, ఆమె కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం మాదాపూర్‌లోని ఆమె నివాసంలో కలిసి ధైర్యం చెప్పారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ధైర్యంగా ఉండాలని అన్నారు. ఎన్నికల్లో సునీతతోపాటు వారి పిల్లలు చూపిన స్ఫూర్తి, పోరాటం అభినందనీయమన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 05:50 AM