Share News

KTR : లొట్టపీసు కేసు పెట్టి శునకానందం!

ABN , Publish Date - Jan 08 , 2025 | 05:37 AM

ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగకపోయినా లొట్టపీసు కేసు పెట్టి కాంగ్రెస్‌ నేతలు శునకానందం పొందుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

 KTR : లొట్టపీసు కేసు పెట్టి శునకానందం!

హైకోర్టు క్వాష్‌ పిటిషన్‌ మాత్రమే కొట్టేసింది.. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాం.. అక్కడ న్యాయపోరాటం చేస్తా

రేవంత్‌.. నువ్వు మొగోనివైతే ఫార్ములా-ఈపై చర్చకు రా!

ముఖ్యమంత్రి ఒక బ్రోకర్‌.. ఒక మంత్రి కాంట్రాక్టర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ఫార్ములా-ఈ రేస్‌ కేసుపై బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ

రేవంత్‌కే శిక్షపడుతుంది: జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో ఎలాంటి అవినీతి జరగకపోయినా లొట్టపీసు కేసు పెట్టి కాంగ్రెస్‌ నేతలు శునకానందం పొందుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. పచ్చకామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని.. రూ.50 లక్షలతో పట్టుబడిన వ్యక్తి అందరినీ దొంగల్లాగానే చూస్తారని ఎద్దేవా చేశారు. మూర్ఖపు ఆలోచనతోనే తనను ఈ కేసులో ఇరికించారని కేటీఆర్‌ అన్నారు. మంగళవారం నందినగర్‌లోని తన ఇంట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లొట్టపీసు కేసుపెట్టి, కథలల్లి, శునకానందం పొందుతున్న చిట్టి నాయుడికి చెబుతున్నా. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై నాకు నమ్మకం ఉంది. నువ్వు పెట్టిన అక్రమ కేసు నుంచి బయటపడతా’ అని చెప్పారు. హైకోర్టులో కేవలం క్వాష్‌ పిటిషన్‌ మాత్రమే కొట్టేశారని, దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని తెలిపారు. అక్కడ న్యాయపోరాటం చేస్తామన్నారు. ‘నేను నేరం చేశానని హైకోర్టు చెప్పలేదు. కానీ, నాకు శిక్ష పడుతుందని, ఏదేదో జరిగిపోతుందని చాలా లీకులు ఇస్తున్నారు. సీఎం చెప్పేవి సూక్తులు కావని అందరూ గుర్తించాలి. నిన్న నా హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు. ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన నన్ను విచారణ జరిపితే ఏమవుతుందోనని రేవంత్‌రెడ్డి భయపడ్డారు. అందుకే నన్ను లాయర్లతో రావొద్దన్నారు. పట్నం నరేందర్‌రెడ్డి చెప్పని మాటలను ఎఫ్‌ఐఆర్‌లో రాశారు. అలా తప్పుడు రాతలు రాస్తారనే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలన్నా. అందుకే 9న న్యాయవాది సమక్షంలో ఏసీబీ విచారణ జరిపేలా అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నా. ఏసీబీతోపాటు ఈడీ విచారణకు కూడా హాజరవుతా’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేసింగ్‌ వ్యవహారంలో అరపైసా అవినీతి కూడా జరగలేదన్నారు.

రేవంత్‌.. నువ్వు మొగోనివైతే..!

తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టే ధైర్యంగా విచారణకు హాజరవుతున్నానని కేటీఆర్‌ చెప్పారు. ‘ఏదో జరిగిపోయిందని శునకానందం పొందడం కాదు. రేవంత్‌.. నువ్వు మొగోనివైతే జూబ్లీహిల్స్‌లో మీ ఇంటిదగ్గర ఉన్న చౌరస్తా వద్ద చర్చకు రా. టీవీలకు లైవ్‌లు పెట్టించు. నీకు అన్నీ వివరిస్తా’ అని సవాల్‌ విసిరారు. ‘మా ఇంట్రెస్ట్‌ ఫార్మర్‌. సీఎం ఇంట్రెస్ట్‌ ఫార్ములా’ అని ఎద్దేవా చేశారు. చిట్టినాయుడు లీకులకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆకర్షితులు కావొద్దని, ఆయనేమీ చేయలేరని చెప్పారు. ‘మీరు నా గురించి కాకుండా రైతులు, తెలంగాణ ప్రజల సమస్యలపై మాట్లాడండి. ప్రభుత్వాన్ని నిలదీయండి’ అని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌ వేరు కాదని, ఇక్కడ ప్రభుత్వానికి రక్షణ కవచంలాగా బీజేపీ పనిచేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం, జన్వాడ ఫాంహౌస్‌, ఇప్పుడు ఫార్ములా-ఈ.. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఏడాదిగా ఇలా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఒక బ్రోకర్‌ అయితే.. మంత్రి పొంగులేటి ఒక కాంట్రాక్టర్‌ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల బాండ్ల విషయంలో బాంబులేంటని, ఆ మంత్రి మాటలు విచిత్రంగా ఉన్నాయని చెప్పారు. గతంలో ఆయన బీఆర్‌ఎ్‌సలోనే ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. కొడంగల్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సంబంధించి రూ.4,600 కోట్లు ఒక సంస్థతో కలిసి పొంగులేటి పంచుకున్నారని, దాన్నే క్విడ్‌ ప్రోకో అంటారని తెలిపారు. అన్ని పార్టీలకు ఇచ్చినట్లే గ్రీన్‌ కో వాళ్లు బీఆర్‌ఎ్‌సకూ ఎన్నికల బాండ్లు ఇచ్చారని, వారికి తామేమీ తిరిగి ఇవ్వలేదు కాబట్టి అది క్విడ్‌ ప్రోకో కాదని చెప్పారు. కొత్తగా మంత్రి పదవి వచ్చిందని.. రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు గుంజుకుంటున్నారని, ఇంకా ఏవేవో చేస్తున్నారని, అవన్నీ ఎప్పుడో ఒకసారి బయటపడతాయని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కేటీఆర్‌ ఇంటి వద్దకు నేతలు

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న ఆయన నివాసానికి బీఆర్‌ఎస్‌ ముఖ్యులు తరలివచ్చారు. పార్టీ శ్రేణులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. తీర్పు సమయంలోనే అక్కడికి చేరుకున్న ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు మాజీమంత్రులు, పలువురు కీలక నేతలు తదుపరి ఏం చేయాలన్నదానిపై చర్చలు జరిపారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తారనే చర్చ జోరుగా సాగుతుండటంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంగళవారం ఉదయం నుంచి నందినగర్‌లోని నివాసంలోనే ఉన్నారు. రాత్రికి కూడా తన విల్లాకు వెళ్లలేదు. ఆయనతోపాటు తల్లి శోభ, కేటీఆర్‌ సతీమణి శైలిమ కూడా నందినగర్‌లోనే ఉన్నారు.


రేవంత్‌రెడ్డికే శిక్షపడుతుంది

ఫార్ములా-ఈ కారు రేసు ఒప్పందాన్ని రద్దు చేసి.. ప్రభుత్వానికి నష్టం కలిగించినందుకు ఈ కేసులో రేవంత్‌రెడ్డికే శిక్ష పడుతుందని మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ, ఒకరిద్దరు తాబేదారులైన అధికారుల సాయంతో సీఎం చేస్తున్న కుట్రలు, కుయుక్తులను ఛేదించి కడిగిన ముత్యంలా కేటీఆర్‌ బయటకు వస్తారని జోస్యం చెప్పారు. రేవంత్‌ సర్కారు బనాయించిన అక్రమ కేసులో ఏమీ లేదని, అంతా లొట్టపీసేనని ఎద్దేవా చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌ గాంధీ కూడా లాయర్‌తోనే విచారణకు హాజరయ్యారని, అలాంటప్పుడు కేటీఆర్‌కు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. రేసు జరగడానికి ఏడాది ముందే గ్రీన్‌ కో కంపెనీ బాండ్లు కొనుగోలు చేసిందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకూ ఆ కంపెనీ విరాళాలు ఇచ్చిందని చెప్పారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు సత్యవతి రాథోడ్‌, గొంగిడి సునీత, మాలోత్‌ కవిత, సునీతా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. జైలుకి వెళ్లి వచ్చిన రేవంత్‌ అందర్నీ జైలుకు పంపించాలని చూస్తున్నారని.. అందుకే కేటీఆర్‌పై అక్రమకేసు బనాయించి.. ఆయన్ను బద్నామ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు.

Updated Date - Jan 08 , 2025 | 05:37 AM