Krishna Board water: తెలంగాణకు 10.26.. ఏపీకి 4 టీఎంసీలు
ABN , Publish Date - May 23 , 2025 | 04:09 AM
కృష్ణా బేసిన్ నుంచి ఏపీకి 4 టీఎంసీలు, తెలంగాణకు 10.26 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర్వులు జారీ చేసిన కృష్ణా బోర్డు
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్ నుంచి ఏపీకి 4 టీఎంసీలు, తెలంగాణకు 10.26 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం శ్రీశైలంలో కనీస నీటిమట్టానికి ఎగువన(800 అడుగులపైన)8.422 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో కనీస నీటి మట్టానికి ఎగువన(505అడుగులపైన) 12.793టీఎంసీలు ఉన్నాయి. ఇందులో ఆవిరి, పంపిణీ నష్టాల కింద 4.243టీఎంసీలను తీసేస్తే... 16.972 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కృష్ణా బోర్డు అంచనా వేసింది.
రెండు జలాశయాల్లో నీటి లభ్యత అంతంత మాత్రంగానే ఉన్నందున... తాగునీటి అవసరాల కోసమే వినియోగించుకోవాలని గుర్తు చేస్తూ ఏపీకి 4టీఎంసీలు, తెలంగాణకు 10.26టీఎంసీలు కేటాయించింది. ఈనెల 22 నుంచి 30వ తేదీ దాకా సాగర్ కుడి ప్రధాన కాలువ నుంచి రోజుకు 5500 క్యూసెక్కుల నీటిని ఏపీకి విడుదల చేయాలని సీఆర్పీఎ్‌ఫను ఆదేశించింది. ఇక, తెలంగాణ తాగునీటి అవసరాల కోసం జూలై 31వ తేదీ దాకా శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలని, కనీస నీటి మట్టం కన్నా దిగువకు పడిపోకుండా చూసుకోవాలని ఏపీని కోరింది.