Share News

తక్షణం ప్రాణహిత-చేవెళ్ల పనులు చేపట్టాలి

ABN , Publish Date - Jun 21 , 2025 | 03:47 AM

తక్షణం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ పనులు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

తక్షణం ప్రాణహిత-చేవెళ్ల పనులు చేపట్టాలి

  • ఏపీ బనకచర్ల ప్రాజెక్టు నిలిపివేయాలి.. కూనంనేని

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి) : తక్షణం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ పనులు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునర్నిర్మాణం, మరమ్మతుల సాధ్యాసాధ్యాలపై అఖిలపక్షం, నీటిపారుదల శాఖ మేధావులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. మఖ్ధూం భవన్‌లో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌ పాషా, పశ్య పద్మలతో కలిసి కూనంనేని సాంబశివరావు విలేకరులతో శుక్రవారం మాట్లాడుతూ.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్‌ పేరిట గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును సీపీఐ మొదటి నుంచీ వ్యతిరేకించిందని గుర్తుచేశారు.


దానికి బదులుగా గతంలో నిర్ణయించినట్లు ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్దనే బ్యారేజీ నిర్మిస్తే, ఒక్క ఎత్తిపోతల ద్వారా ఎల్లంపల్లికి గ్రావిటీతో నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉండేదన్నారు. అంతేగాక కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను మినహాయించి మిగతా మేడారం, మోతే, మిడ్‌మానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్‌, మల్లన్న సాగర్‌, తిప్పారం రిజర్వాయర్లను వినియోగించుకోవచ్చని తెలిపారు. విద్యుత్‌ భారం ఏడాదికి కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే అవుతుందన్నారు. తెలంగాణకు నష్టం కలిగించేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ నాయకురాలు పశ్య పద్మ డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 21 , 2025 | 03:47 AM