Kodada Rajesh Death: కోదాడ గాంధీనగర్‌లో టెన్షన్ వాతావరణం
ABN , Publish Date - Nov 19 , 2025 | 10:02 PM
కోదాడ గాంధీనగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్ల రాజేష్ మృతికి నిరసనగా ఉదయం నుండి కొనసాగుతున్న ఆందోళన రాత్రికి తీవ్రతరమైంది. ఎస్సై సురేష్ రెడ్డిని విధుల నుండి బహిష్కరించాలని స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సూర్యాపేట, నవంబర్ 19: కోదాడ గాంధీనగర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్ల రాజేష్ మృతికి నిరసనగా ఉదయం నుండి కొనసాగుతున్న ఆందోళన రాత్రికి తీవ్రతరమైంది. ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్ మహారాజన్ ఆందోళనలో పాల్గొన్నారు. చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని విధుల నుండి బహిష్కరించాలని స్థానికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళ విరమించేది లేదని భీష్మించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా గాంధీనగర్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇలాఉండగా, సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన ఒక దళిత యువకుడ్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, ఆ యువకుడి మృతికి పోలీసులే కారణమని, పోలీసులు తీవ్రంగా హింసించడంతోనే రాజేష్ మరణించాడని కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే, కోదాడలోని కల్లుగడ్డ బజారులో నివాసముండే కర్ల రాజేష్ (30) అనే యువకుడు అనారోగ్య సమస్యల చికిత్స ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో రాజేష్ పేరు మీద రూ. 1 లక్ష మంజూరైనట్లు, ఆ చెక్కును దొండపాడు ప్రాంతానికి చెందిన చెడపంగు నరేష్ అనే వ్యక్తి కాజేశాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ రాజేష్ స్థానిక కోదాడ రూరల్ పోలీసులను ఆశ్రయించాడు.
అయితే, పోలీసులు బాధితుడైన రాజేష్‌కు న్యాయం చేయాల్సింది పోయి, అతన్నే కస్టడీలోకి తీసుకుని చంపేశారంటూ మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సహా పలువురు సిబ్బంది రాజేష్‌ను అదుపులోకి తీసుకుని 4 రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారని కుటుంబ సభ్యులు అంటున్నారు.
కాగా, తీవ్ర గాయాలు, అనారోగ్యంతో ఉన్న రాజేష్‌ను పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, రిమాండ్ నిమిత్తం హుజూర్‌నగర్ సబ్ జైలుకు తరలించారు. జైలుకు వెళ్లినప్పటి నుంచి రాజేష్ తీవ్రమైన శ్వాస సమస్యలతో బాధపడటంతో జైలు సిబ్బంది ఆసుపత్రికి తరలించగా.. అతని పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజేష్‌ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే అతను మృతి చెందాడు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్తత మొదలైంది.
ఇవి కూడా చదవండి..
ఎర్రకోట బ్లాస్ట్‌లో షాకింగ్ అప్‌డేట్.. పార్కింగ్ లాట్‌లోనే బాంబు తయారు చేసి..
టీవీకే సభ్యులకు క్యూ ఆర్ కోడ్‌తో గుర్తింపు కార్డులు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..