Share News

Kishan Reddy: డ్రగ్స్‌ కట్టడికి ప్రజా ఉద్యమం రావాలి

ABN , Publish Date - Aug 31 , 2025 | 04:51 AM

మాదక ద్రవ్యాల కట్టడికి ప్రజా ఉద్యమం అవసరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రతి ఇంచి నుంచి ఒకరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనకపోతే ఈ సమస్య నుంచి బయటపడలేమని చెప్పారు.

Kishan Reddy: డ్రగ్స్‌ కట్టడికి ప్రజా ఉద్యమం రావాలి

  • ప్రతి ఇంటి నుంచి ఒకరు కదలాలి: కిషన్‌రెడ్డి

  • ఓయూలో డ్రగ్స్‌ నియంత్రణపై అవగాహన సదస్సు

ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల కట్టడికి ప్రజా ఉద్యమం అవసరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రతి ఇంచి నుంచి ఒకరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనకపోతే ఈ సమస్య నుంచి బయటపడలేమని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ లా విభాగం, విజన్‌-2047 ప్రొఫెషనల్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ఓయూ దూర విద్య కేంద్రం ఆడిటోరియంలో ‘‘భారత్‌లో డ్రగ్స్‌పై పోరాటం-న్యాయ, విధాన దృష్టికోణం’’ అనే అంశంపై శనివారం నిర్వహించిన సెమినార్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశంగా ఉన్న మనం మాదక ద్రవ్యాల వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. యువతకు చట్టాలపై అవగాహన ఉన్నా మత్తు పదార్థాలకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.


ప్రస్తుతం ఆధునిక సాంకేతికతతో ఏదైనా సాధించే దశకు చేరుకున్నామని, అయితే మాదక ద్రవ్యాలకు బానిసలైతే, ఏ సాంకేతికత, అభివృద్ధి మనల్ని కాపాడలేవని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. మాదక ద్రవ్యాల కట్టడికి.. పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికతో పని చేయాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. మాదకద్రవ్యాలు, మద్యపానం, అవినీతి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని.. వీటన్నింటి కట్టడిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన యువత వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని విజన్‌ 2047 ప్రొఫెషనల్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ హరిచరణ్‌ అన్నారు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉంటామని శపథం చేయాలని కోరారు. డ్రగ్స్‌ వినియోగం, పర్యవసానాలపై ఓయూ అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ నరే్‌షరెడ్డి అన్నారు. మన దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో మత్తు పదార్థాల వినియోగం అత్యంత ప్రమాదకరమైనదని తెలిపారు.

Updated Date - Aug 31 , 2025 | 04:51 AM