Share News

Kishan Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలవి నాటకాలు

ABN , Publish Date - Jun 21 , 2025 | 03:38 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి నాటకాలాడుతున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలవి నాటకాలు

  • వాళ్ల పాపాల వల్లే తెలంగాణ అప్పులపాలు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి నాటకాలాడుతున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చెయ్యి.. అన్నట్లుగా ఆ రెండు పార్టీల వైఖరి ఉందని, బీజేపీని అడ్డుకునేందుకు పన్నిన కుట్రలో భాగంగానే అవి నాటకాలకు తెరతీశాయని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్క్‌షా్‌పలో కిషన్‌ రెడ్డి మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు చాలా భయంకరమైనదని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జడ్జిలు, వ్యాపారస్తులు, సినీనటులు, విపక్ష నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాప్‌ చేశారని, బీజేపీ ఆఫీసులో పనిచేసే సిబ్బంది, నాయకులు, సోషల్‌ మీడియా టీమ్‌ ఫోన్లనూ ట్యాప్‌ చేశారన్నారు. ఈ వ్యవహారంపై రేవంత్‌ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేశారని, అధికారంలోకి రాగానే మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వివిధ అంశాలను తెరపైకి తీసుకొస్తోందన్నారు.


కాంగ్రెస్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ హాయంలో జరిగిన అవినీతి, అక్రమాలను.. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి చైతన్యం తీసుకురావాలన్నారు. పార్టీ మండల కమిటీలు, జిల్లా కమిటీల నుంచి వచ్చిన నూతన నాయకత్వం రానున్న రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని, పార్టీ వర్క్‌ షాప్‌లు నిర్వహించుకోవాలని సూచించారు.సీఎం రేవంత్‌ రెడ్డి.. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా అప్పుపుట్టడం లేదంటూ మాట్లాడుతున్నారని, దీనికి కారణం గత బీఆర్‌ఎస్‌, ప్రస్తుత ప్రభుత్వాల పాపాలేనని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల చేతగానితనం, అసమర్థత కారణంగానే తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైందని ఆయన మండిపడ్డారు.

Updated Date - Jun 21 , 2025 | 03:38 AM