KCR Confident: సునీత విజయం ఖాయం
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:44 AM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీత గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయంచేశారని....
భారీ మెజారిటీ లక్ష్యంగా పని చేయండి.. ప్రజలు విజ్ఞతతో ఓటు వేస్తారు
రౌడీ షీటర్ కుటుంబాన్ని ఓడిస్తారు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్‌ఎస్ సమీక్షలో కేసీఆర్
హైదరాబాద్, గజ్వేల్/మర్కుక్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీత గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయంచేశారని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. భారీ మెజార్టీ దక్కించుకునేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గురువారం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత, కేటీఆర్, హరీశ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్‌సగౌడ్, లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇతర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు, ఇతర అంశాలతో రూపొందించిన నివేదికలు పార్టీ ఇన్‌చార్జ్‌లు కేసీఆర్‌కు అందజేశారు. ప్రచారం కొనసాగుతున్న తీరును కేసీఆర్ సమీక్షించారు. విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ శ్రేణులు జూబ్లిహిల్స్ ప్రజలతో మమేకం కావాలని, కాంగ్రెస్ దుష్టపాలనపై ఓటర్లకు అవగాహన కల్పించాలని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిందని, దాని దోపిడీ పాలనతో రాష్ట్రం గుల్ల అయిందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన అద్భుత కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రౌడీ షీటర్ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి, నగర ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందన్నారు. ఓటర్లు అతన్ని చిత్తుగా ఓడించి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని హైదరాబాద్‌లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దిగజారిన అభివృద్థి, ఆర్థిక దుస్థితిని ఇంటింటికి తిరిగి వివరించాలన్నారు.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలనలో ఎందుకు మాయమయ్యాయి? అనే అంశంపై ప్రజలతో చర్చ జరపాలని మాజీ ముఖ్యమంత్రి సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఆర్‌ఎస్‌సకు ఢోకాలేదని, హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలబెట్టిన బీఆర్‌ఎస్ వైపే ప్రజలు ఉన్నారని చెప్పారు. కేసీఆర్ కిట్‌లు, గొర్రెల పంపిణీ, చేపపిల్లల పంపిణీ, మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు ఆపారో కాంగ్రెస్ అభ్యర్థిని, నాయకులను నిలదీయాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిచ్చారు. హైడ్రా పేరుతో గుడిసెల మీదకు బుల్డోజర్లు పంపుతున్న కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీయండి అన్నారు. తాను కరోనా, పెద్ద నోట్ల రద్దు లాంటి సంక్షోభాల్లో తట్టుకొని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించానని గుర్తు చేసుకున్నారు. అలాంటి రాష్ట్రాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా అతలాకుతలం చేస్తోందని వ్యాఖ్యానించారు. వాళ్లకు ఉన్న ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ మాత్రమేనని, రాష్ట్ర ప్రజలు పూర్తి స్పష్టతతో ఉన్నారని అన్నారు. తెలంగాణలో పల్లెల్లోనే కాకుండా హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా జనం చేతుల్లో పైసల్లేక అల్లాడిపోతున్నారని చెప్పారు. కారోబార్ లేక రాష్ట్రంలోని అన్ని వర్గాలు అల్లాడిపోతున్నాయని తనను కలిసిన ఒక పెద్దమనిషి చెప్పారన్నారు. పదేళ్లు పస్తులుండి పైసా పైసా కూడబెడితే కాంగ్రెస్ వచ్చి రెండేళ్లలో ఖతం జేసిందని ఆరోపించారు. ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని, చివరిదాకా నిలబడటమే పార్టీ నేతలు చేయాల్సిన పని అని చెప్పారు. నామినేషన్ల రోజే కత్తులు తిప్పారంటే రేపు గెలిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మాగంటి గోపీనాథ్ నియోజకవర్గ ప్రజల హృదయాలు గెలిచిన నేత అని, ఆ అభిమానాన్ని బీఆర్‌ఎస్ కాపాడుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లు, క్లస్టర్ల ఇన్‌చార్జులు దాదాపు 400 మంది పాల్గొన్నారు.