Kavitha Will Start Political Party: ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:29 AM
ప్రజలు కోరుకుంటే తాను తప్పకుండా రాజకీయ పార్టీని పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు....
ప్రజా సమస్యలపై ‘జాగృతి జనం బాట’
రేపు నిజామాబాద్ నుంచి ప్రారంభం
4 నెలల పాటు 33 జిల్లాల్లో పర్యటనలు: కవిత
యాదాద్రి/హైదరాబాద్/కవాడిగూడ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రజలు కోరుకుంటే తాను తప్పకుండా రాజకీయ పార్టీని పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల 25వ తేదీ నుంచి ‘జాగృతి జనం బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, నిజామాబాద్ జిల్లా నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 33 జిల్లాల్లో నాలుగు నెలల పాటు యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘జాగృతి జనం బాట’ విజయవంతం కావాలని, ప్రజలకు వద్దకు వెళ్లే క్రమంలో అర్థం చేసుకునే శక్తిని ప్రసాదించాలన్న ఆలోచనలతో దైవ దర్శనం చేసుకున్నానని తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు వేదిక ఏర్పాటుచేసి, ఈ సమావేశానికి విద్యావంతులు, రైతులు, కూలీలు, విద్యార్థులు, మహిళలు, యువతను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా గ్రూప్-1 నియామకాలు చేపట్టడంతో తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సుమోటోగా విచారణ జరపాలని కవిత కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌కి గురువారం ఆమె లేఖ రాశారు. ఇక వీఓఏల హక్కుల సాధన కోసం పోరాడుతామని, లాఠీ దెబ్బలు తినడానికి తాను సిద్ధమని కవిత అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం విలేజీ ఆర్గనైజర్ అసిస్టెంట్ (వీఓఏ)ల వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ ఐకేపీ వీఓఏల ఉద్యోగుల సంఘం(సెర్ప్) ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో నిర్వహించిన మహాధర్నాకు కవిత ముఖ్య అతిథిగా హాజరై మద్దతు ప్రకటించారు.