Share News

Kavitha: ఆహ్వానిస్తే.. బీఆర్‌ఎస్‌ బీసీ సభకు వెళ్తా

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:16 AM

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టే బీసీ సభకు రమ్మని పిలిస్తే.. వెళ్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

Kavitha: ఆహ్వానిస్తే.. బీఆర్‌ఎస్‌ బీసీ సభకు వెళ్తా

ఇప్పటివరకైతే నాకు ఎలాంటి పిలుపు రాలేదు.. ఢిల్లీలో కాంగ్రెస్‌ నిజ స్వరూపం బట్టబయలైంది

  • ధర్నాకు రాహుల్‌ మొహం చాటేశారు

  • సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా జాగృతి కృషి: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌/హైదరాబాద్‌సిటీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టే బీసీ సభకు రమ్మని పిలిస్తే.. వెళ్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ చేపట్టదలచిన బీసీ సభ వాయిదా పడినట్లు తెలిసిందని, ఇందులో పాల్గొనాలని ఇప్పటివరకైతే తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు. బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో బుధవారం తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవం, జాగృతి శ్రేణులతో సమావేశం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ నడివీధుల్లో కాంగ్రెస్‌ నిజస్వరూపం మరోసారి బట్టబయలైందని, తెలంగాణ బీసీ బిడ్డలను వరుసగా రెండు సార్లు ఢిల్లీకి పిలిపించి రాహుల్‌ గాంధీ అవమానించారని దుయ్యబట్టారు. గతంలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు గైర్హాజరైన ఆయన.. ఇప్పుడు మరోసారి మొహం చాటేశారని విమర్శించారు. ‘ఎక్స్‌’లో ఒక పోస్టు పెట్టి చేతులు దులుపుకొన్నారని ధ్వజమెత్తారు. రాహుల్‌ను ఉద్దేశించి.. మిస్టర్‌ ఎలక్షన్‌ గాంధీ బీసీలంటే మీకు అంత చులకనా? అని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని, 42ు బీసీ రిజర్వేషన్లలో ముస్లింల అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకముందే కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.


నాటకాలాడుతున్న బీజేపీ, కాంగ్రె్‌సకు తెలంగాణ బీసీలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ దొంగ ధర్నాలతో ఒరిగేదేమీ లేదని, బీసీ బిల్లుల ఆమోదం కోసం సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రపతిని కలవాలని డిమాండ్‌ చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, ఈ మేరకు అన్ని పార్టీల అధ్యక్షులకు లేఖలు రాయాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్‌ అమలుకు తీసుకొచ్చిన ఆర్డినెన్సును గవర్నర్‌ ఆమోదించకపోతే.. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఢిల్లీలో బీసీ ధర్నా కోసమే తన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిందని దుయ్యబట్టారు. కాగా, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా అన్ని అంశాలపై పోరాడతామని, రాష్ట్రంలో సామాజిక, సాంస్కృతిక విప్లవోద్యమాలకు జాగృతి సంస్థ నాయకత్వం వహిస్తుంద ని కవిత తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక సామాజిక తె లంగాణ కోసం, బీసీల కోసం ఉద్యమిస్తానని జయశంకర్‌ చెప్పేవారని, ఆయన స్ఫూర్తితో జాగృతి పని చేస్తుందని తెలిపారు. తెలంగాణ జాగృతిని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా, మండల స్థాయిలో కమిటీలను వేస్తామని, ఈనెల 15లోపు మరిన్ని కమిటీలను ప్రకటిస్తామని కవిత వెల్లడించారు.

Updated Date - Aug 07 , 2025 | 04:16 AM