Kalvakuntla Kavitha: యువతరం వస్తేనే స్వచ్ఛ రాజకీయాలకు నాంది
ABN , Publish Date - Jun 16 , 2025 | 03:43 AM
యువతరం రాజకీయాల్లోకి వస్తేనే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
భవిష్యత్ నాయకులను తయారు చేయాల్సిన అవసరముంది
ప్రతినెలా మూడు రోజులు శిక్షణ: కవిత
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): యువతరం రాజకీయాల్లోకి వస్తేనే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘లీడర్’ పేరిట చేపట్టనున్న రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. యువత, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని ఆమె తెలిపారు. తెలంగాణ అంటే ప్రశ్నించే తత్వం ఉన్న గడ్డ అని, ఈ కార్యక్రమం ద్వారా యువతకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పించాలని ఆమె కోరారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా మూడురోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తారని చెప్పారు.
జులైలో హైదరాబాద్‌లో ప్రారంభించి, ఆగస్టు నుంచి మిగతా జిల్లాల్లో చేపడతారని తెలిపారు. ప్రజాస్వామ్యంపై ఆసక్తి ఉన్నవారు.. ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనాలని కోరారు. సర్పంచ్ మొదలు ఎమ్మెల్యే, ఎంపీల దాకా ప్రజా ప్రతినిధుల విధులు, పరిధి, పరిమితులు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం, అభివృద్ధికి నిధులు సాధించడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వరంగల్, హన్మకొండ, హైదరాబాద్‌కు చెందిన పలువురు యువకులు, మహిళలు, విద్యార్థులు తెలంగాణ జాగృతిలోగా వారికి కవిత కండువాలు కప్పి ఆహ్వానించారు.