Jagruti Party President: 12ఏళ్లలో సీఎంలు బడులకు ఏమీ చేయలేదు.. కేసీఆర్, రేవంత్‌లపై కవిత విమర్శ
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:17 AM
గత 12 ఏళ్లలో తెలంగాణ సీఎంలు ప్రభుత్వ బడుల కోసం ఏమీ చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.
బీఆర్‌ఎస్ వాళ్ల కామెంట్లకు జాగృతి కౌంటర్ ఉంటుందని హెచ్చరిక
‘కర్మ హిట్స్ బ్యాక్’ అని ఎవరిని ఉద్దేశించి అన్నారంటే.. ‘జైతెలంగాణ’ అంటూ సమాధానం
హైదరాబాద్/ మధిర రూరల్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): గత 12 ఏళ్లలో తెలంగాణ సీఎంలు ప్రభుత్వ బడుల కోసం ఏమీ చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ సీఎంలుగా చేసిన ఇద్దరూ ప్రభు త్వ బడుల్లో చదువుకొని వచ్చామని మాత్రం చెబుతారని పేర్కొన్నారు. వారికి నిజమైన భావోద్వేగం ఉండుంటే రాష్ట్ర విద్యావ్యవస్థలోని సమస్యలు ఎప్పు డో పరిష్కారం అయ్యేవని చెప్పారు. ఇక తాను చేసిన ఆరోపణలపై మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం - విద్యావ్యవస్థ’ అంశంపై తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో, తర్వాత మీడియా ప్రతినిధులతో కవిత మాట్లాడారు.
హరీశ్‌రావు, గంగుల వివరణ ఇవ్వాలి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ ఓటమి అనంతరం ‘కర్మ హిట్స్ బ్యాక్ (కర్మ మనకు తిరిగి తగులుతుంది)’ అంటూ ‘ఎక్స్’ వేదికగా కవిత పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారని మీడియా ఆమెను ప్రశ్నించగా.. ‘జై తెలంగాణ’ అని మాత్రమే కవిత సమాధానమిచ్చారు. బీఆర్‌ఎస్ నేతలపై ఆమె తరచూ చేస్తున్న ఆరోపణలను ప్రస్తావించగా.. ‘‘జాగృతి జనంబాట కార్యక్రమంలో ప్రజలు చెప్పిన అంశాల ఆధారంగానే నేను ఆరోపణలు చేశాను. నేనేమీ ఏసీ గదిలో కూర్చుని మాట్లాడటం లేదు. నా ఆరోపణలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ వివరణ ఇచ్చినందుకు సంతోషం. అదే సమయంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ కూడా నా ఆరోపణలపై వివరణ ఇవ్వా లి. బాధ్యత కలిగినవారు వివరణ ఇచ్చుకోవాలే తప్ప ఎదురుదాడి చేయటం మంచిదికాదు’’ అని కవిత పేర్కొన్నారు. తనపై బీఆర్‌ఎస్ వాళ్లు చేసే కామెంట్లకు జాగృతి కార్యకర్తల నుంచి కౌంటర్ ఉంటుందని హెచ్చరించారు.
విద్యాశాఖలో మార్పుల కోసం ఒత్తిడి చేస్తాం
విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న సీఎం రేవంత్.. ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం ఏం చేశారని కవిత ప్రశ్నించారు. విద్యా కమిషన్ ఏర్పాటు చేయ డం మంచి నిర్ణయమే అయినా.. ఆ కమిషన్ ప్రాధాన్యతలు, పనితీరుపై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రస్తుత విద్యావ్యవస్థలో మార్పులకోసం ప్రయత్నిస్తామని కవిత పేర్కొన్నారు.
రైలు జనరల్ బోగీలో ప్రయాణం
సోమ, మంగళవారాల్లో ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిత ఆదివారం మధిర చేరుకున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి శాతవాహన ఎక్స్‌ప్రెస్ డి6 కోచ్‌లో ఆమె ప్రయాణించారు. రైలులోనే పలువురు ప్రయాణికులతో మాట్లాడారు.