యాసంగికి వారబందీ పద్ధతి
ABN , Publish Date - Dec 24 , 2025 | 01:35 AM
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి సీజన్‌కు వారబందీ పద్ధతిలో నీటి విడుదల చేపట్టడానికి అధికారులు నిర్ణయించారు.
జగిత్యాల, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి సీజన్‌కు వారబందీ పద్ధతిలో నీటి విడుదల చేపట్టడానికి అధికారులు నిర్ణయించారు. ఈ యేడాది వర్షాకాలం ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. కాకతీయ కాలువ ద్వారా ఏడు రోజులు జోన్ - 1కు 3,500 క్యూసెక్కులు, ఎనిమిది రోజులు జోన్-2కు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. లక్ష్మీ కాలువ, సరస్వతీ కాలువ, గుత్ప, అల్లీసాగర్ ఎత్తిపోతల పథకాలకు సైతం నీటి కేటాయింపులు జరిపారు. యాసంగిలో సాగుకు నీరు అందించడానికి అధికారులు 57.68 టీఎంసీలను కేటాయించారు. ఈనెల 24వ తేదీ నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదలను అధికారులు ప్రారంభించనున్నారు.
ఫయాసంగి సాగుకు నో ఢోకా..
జిల్లాలో యాసంగి సాగుకు నీటికి ఢోకా లేకుండా పోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీటి మట్టం ఉండడం అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతోంది. వానాకాలంలో పండించిన పంటలు ప్రస్తుతం చేతికి వచ్చినప్పటికీ శ్రీరాంసాగర్ ఇంకా నిండుకుండ మాదిరిగానే ఉంది. దీంతో యాసంగి సీజన్‌కు నీరు సమృద్ధిగా అందనుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. జిల్లాలో వానాకాలంలో సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరు అందించారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో సైతం మూడున్నర లక్షల ఎకరాలకు పైగా సాగు నీరు అందనుంది. జిల్లాలో యాసంగిలో వివిధ పంటల సాగు అయ్యే అవకాశాలున్నాయి.
ఫఉన్నత స్థాయి సమావేశంలో సర్కారుకు ప్రతిపాదన..
వారబందీ (ఆన్ అండ్ ఆఫ్) పద్ధతిలో ఎస్సారెస్పీ నీటి విడుదల జరగనుంది. ఎనిమిది రోజుల పాటు ఆన్, 7 రోజుల పాటు ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా ఎనిమిది తడులుగా నీటి విడుదల చేయనున్నారు. కాకతీయ కాలువ ద్వారా డీ-5 నుంచి డీ-53 కాలువకు ఏడు రోజులు, డీ-53 నుంచి డీ 94 వరకు కాలువలకు ఎనిమిది రోజులు 3,500 క్యూసెక్కుల నీటిని వదలనున్నారు. కాకతీయ కాలువ ఆధారంగా పంపు సెట్‌లు అమర్చుకున్న రైతులకు నీరు అందించేందుకు ప్రతీ రోజు 500 క్యూసెక్యుల నీటిని కేటాయించారు. మిగితా కాలువల ద్వారా నిరంతరం నీటి విడుదల జరుగుతుంది. డిసెంబర్ 24వ తేదీ నుంచి 2026 ఏప్రిల్ 8వ తేదీ వరకు నీటి విడుదలను చేపట్టనున్నారు. యాసంగిలో సాగుకు నీరు అందించడానికి అధికారులు 57.68 టీఎంసీలను కేటాయించారు. మొత్తం 105 రోజుల పాటు నీరు విడుదల చేయనున్నారు. ఇందులో కాకతీయ కాలువకు 41.43 టీఎంసీలు, సరస్వతీ కాలువకు 3.39 టీఎంసీలు, లక్ష్మీ కాలువకు 1.48 టీఎంసీలు, అల్లీసాగర్‌కు 2.29 టీఎంసీలు, గుత్పా ఎత్తిపోతల పథకానికి 1.14 టీఎంసీలు, నిజామాబాద్, నిర్మల్ టీఎస్‌ఐడీసీ పథకానికి 1.32 టీఎంసీలు, మిషన్ భగీరథకు 2.10 టీఎంసీలు, ఆవిరి కావడం ద్వారా 4.54 టీఎంసీలు వ్యయం అవుతుందని అధికారులు నిర్ణయించారు.
ఫఎస్సారెస్పీలో ఆశించిన స్థాయిలో నీటి మట్టం..
ప్రస్తుత యేడాది వర్షాకాలంలో అంచనాకు మించి వర్షాలు కురిశాయి. ఎగువ ప్రాంతంలో సైతం వర్షాలు అధికంగా కురవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చింది. ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ద్వారా నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందుతోంది. యాసంగి సీజన్‌లో డిసెంబరు మాసం నుంచి నీరు విడుదల చేయనున్నారు. శ్రీరాంసాగర్‌లో ఆశించిన స్థాయిలో నీటి మట్టం ఉండడంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన నీరు వచ్చినట్లే గోదావరిలోకి వదిలారు. రికార్డు స్థాయిలో గోదావరిలోకి ఎస్సారెస్పీ నీటిని వదిలారు. దీంతో జగిత్యాల జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో సైతం సాగునీరు అందుబాటులో ఉన్నట్లయింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్, ధర్మపురి, వెల్గటూరు తదితర మండలాల్లోని పలు గ్రామాలకు గోదావరి జలాలు అందనున్నాయి. వరద కాలువకు సైతం ఎస్సారెస్పీ నీటిని వదులుతుండడంతో కాలువ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల రైతులకు నీరు అందే అవకాశాలున్నాయి.
ఫశ్రీరాంసాగర్‌లోకి 949.813 టీఎంసీల నీరు..
ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చింది. ప్రస్తుత సీజన్‌లో జూన్ 1వ తేది నుంచి ఇప్పటివరకు 949.813 టీఎంసీల నీరు వచ్చింది. అందులో నుంచి వరద గేట్లను ఎత్తడం ద్వారా గోదావరిలోకి, కాకతీయ కాలువ, లక్ష్మీ కాలువ, వరద కాలువ, అల్లీసాగర్ ఎత్తిపోతలు, గుత్ప ఎత్తిపోతలు, మిషన్ భగీరథ, ఎస్కేప్ ద్వారా 882.100 టీఎంసీల నీరును వదిలారు. ప్రస్తుతం డ్యామ్‌లో 80.053 టీఎంసీల నీరు నిలువ ఉంది. ఉన్నత స్థాయి అధికార బృందం సమావేశంలో చేసిన ప్రతిపాదనలు, సర్కారు ఆమోదం నిర్ణయం మేరకు యాసంగికి సాగు నీటిని అందించడానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
ఫజిల్లాలో 3.10 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా..
జిల్లాలో యాసంగి సీజన్‌లో సుమారు 3.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారన్న అంచనా ఉంది. ఇందులో ప్రధానంగా వరి పంటను సాగు చేయనున్నారు. జిల్లాలో వరి పంట 3.10 ఎకరాలు, మొక్కజొన్న 55 వేలు ఎకరాలు, నువ్వులు 23 వేలు ఎకరాలు, పల్లి 300 ఎకరాలు, పెసర 500 ఎకరాలు, మినుము 500 ఎకరాలు, ఆలసంద 500 ఎకరాలు, ఆవాలు 3,000 ఎకరాలు, చెరుకు 900 ఎకరాలు, ఆయిల్ ఫామ్ 9,000 ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీతో పాటు చెరువులు, కుంటలు, గోదావరి నది, ప్రాజెక్టులల్లో సమృద్దిగా నీరు ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సుమారు 40 వేల ఎకరాలకు పైగా యాసంగి సాగు ప్రారంభమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 355 ఎకరాల్లో జొన్న, 527 ఎకరాల్లో పల్లి, 42 ఎకరాల్లో పెసర, 29 ఎకరాల్లో మినుము, 120 ఎకరాల్లో శనగ, 85 ఎకరాల్లో ఆవాలు సాగవుతున్నట్లు తెలుస్తోంది. కాగా జిల్లాలో యాసంగిలో సుమారు 3.50 లక్షల ఎకరాల్లో వరి సాగు కానున్నట్లు అంచనాలున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి నారు పూర్తయినట్లు అధికారులు అంటున్నారు.
ఫసాగు నీరు ఇలా..
జిల్లాలో ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. ఇబ్రహీంపట్నం మండలం నుంచి పెగడపల్లి మండలం వరకు సుమారు 91 కిలోమీటర్ల మేర కాకతీయ కాలువ ప్రవహిస్తోంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు విడుదల చేస్తున్న నీరు 25వ కిలోమీటరు వద్ద జగిత్యాల జిల్లాలో ప్రవహిస్తోంది. 116వ కిలో మీటరు వద్ద ముగుస్తోంది. జిల్లాలోని వివిధ గ్రామాలకు కాకతీయ కాలువకు అనుబందంగా ఉప కాలువలను నిర్మించి నీరు సరాఫరా చేస్తున్నారు. జిల్లాలో డీ - 21 ఉప కాలువ నుంచి డీ 83ఏ వరకు దాదాపుగా 62 డిస్ట్రిబ్యూటర్ కాలువలు ఉన్నాయి. ఒక్కో డిస్ట్రిబ్యూటరీకి ఆయకట్టును బట్టి ఎడమ, కుడి వైపులకు మరో 50 వరకు కాలువలు ఉంటాయి. సంబందిత మైనర్ కాలువల ద్వారా సాగునీరు పంట పొలాలకు అందించాల్సి ఉంటుంది. జిల్లాలో దాదాపుగా ఎస్సారెస్పీ ద్వారా 1.70 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. డిస్ట్రిబ్యూటరీలకు సమీపంలో ఉండే చెరువులు, కుంటలు నింపేందుకు తూములు ఏర్పాటు చేయడం వల్ల సుమారు మరో లక్ష ఎకరాలకు ఎస్సారెస్పీ సాగు నీరు అందుతోంది.
ఫఅధ్వాన్నంగా కాలువలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా చేసే కాలువలు అధ్వాన్నంగా తయారయ్యాయి. కాలువల్లో పూడిక, మొక్కలు పేరుకుపోయాయి. ప్రధానమైన కాకతీయ కాలువ సైతం పలు ప్రాంతాల్లో ప్రమాదకరంగా తయారైంది. కాలువ ఆనకట్టలు కుంగిపోయాయి. సీజన్ ప్రారంభం ముందు అధికారులు కాలువల పూడిక తొలగించుట, మైనర్ రిపేర్లు చేయడంలాంటి చర్యలు చేపట్టలేదు. చివరి ఆయకట్టు వరకు నీరు సరఫరాకు ఇబ్బంది కలిగేలా ఉంది.
రైతులు సహకరించాలి
-చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ
ఈనెల 24వ తేదీ నుంచి యాసంగి పంటల సాగు కోసం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేస్తున్నాం. ఆయకట్టు రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. వారంబందీ ప్రకారం నీటి విడుదల కొనసాగుతుంది.