Share News

యాసంగి సాగు ప్రణాళిక ఖరారు..

ABN , Publish Date - Dec 06 , 2025 | 01:21 AM

జిల్లాలో యాసంగి సీజన్‌ పనులు ఆరంభమ య్యాయి. వరి కోతలు పూర్తి కావస్తుండడంతో వ్యవ సాయ బావుల కింద రైతులు వరి నార్లు పోస్తున్నారు. కొందరు రైతులు దుక్కులు దున్నుతున్నారు. వర్షాధారం కింద పత్తి పంట సాగు చేసిన భూముల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2,40,165 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, తదితర పంటలు సాగు కానున్నాయని అంచనా వేశారు.

యాసంగి సాగు ప్రణాళిక ఖరారు..

- 2,40,165 ఎకరాల్లో సాగు కానున్న పంటలు

- అత్యధికంగా 2,08,728 ఎకరాల్లో సాగు కానున్న వరి

- ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల్లో పుష్కలంగా నీళ్లు

(ఆంరఽధజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో యాసంగి సీజన్‌ పనులు ఆరంభమ య్యాయి. వరి కోతలు పూర్తి కావస్తుండడంతో వ్యవ సాయ బావుల కింద రైతులు వరి నార్లు పోస్తున్నారు. కొందరు రైతులు దుక్కులు దున్నుతున్నారు. వర్షాధారం కింద పత్తి పంట సాగు చేసిన భూముల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2,40,165 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, తదితర పంటలు సాగు కానున్నాయని అంచనా వేశారు. సాగు నీటి వనరుల్లో పుష్కలంగా నీళ్లు ఉండడంతో రైతులు పూర్తి స్థాయిలో వివిధ రకాల పంటలు సాగు చేసేందుకు సన్నద్ధమయ్యారు. జిల్లాలో సాగయ్యే పంటల్లో 2,08,728 ఎకరాల్లో వరి, 18,940 ఎకరాల్లో మొక్కజొన్న, 12,497 ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేయనున్నారు. ఈ పంటల సాగుకు 38 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, 4,707 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 3,260 మెట్రిక్‌ టన్నుల పొటాష్‌, 22,732 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌, 599 మెట్రిక్‌ టన్నుల సూపర్‌ ఫాస్పేట్‌, మొత్తం 69,244 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. గడిచిన వర్షాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా పుష్కలంగా వర్షాలు కురిశాయి. అన్ని మండలాల్లో సాధారణ స్థాయికి మించి వర్షాలు పడ్డాయి. వానా కాలం సీజన్‌లో కూడా పూర్తి స్థాయిలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేశారు. జిల్లాకు వర ప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 80.501 టీఎంసీలు కాగా, అంతే మొత్తంలో నీళ్లు ఉండడం గమనార్హం. అలాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా, అంతే మొత్తంలో నీళ్లు ఉన్నాయి. జిల్లాలో ఎస్సారెస్పీ కింద లక్షా 70 వేల ఎకరాల వరకు సాగవుతున్నది. ఈ నెలాఖరులో గానీ జనవరి మొదటి వారంలో ఆన్‌అండ్‌ఆఫ్‌ విధానంలో పంటలకు సాగు నీటిని విడుదల చేయనున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా గుండారం రిజర్వాయర్‌, నంది మేడారం రిజర్వాయర్‌ భూములకు సాగు నీళ్లు అందనున్నాయి. అవసరమైతే రామగుండం ఎత్తిపోతల పథకం ద్వారా ఆ నియోజవర్గంలోని ఎస్సారెస్పీ భూము లకు సాగు నీటిని విడుదల చేయనున్నారు. చెరువులు, కుంటల్లో కూడా పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. భూగర్భ జలాలు పైపైనే ఉండడంతో వ్యవసాయ బావుల్లో నీళ్లు బాగానే ఉన్నాయి. యాసంగి సాగుకు నీళ్లకు ఢోకా లేకపోవడంతో రైతులు పూర్తి స్థాయిలో పంటలను సాగు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలో సాగయ్యే భూమిలో 80 శాతానికి పైగా వరి పంటనే రైతులు సాగు చేయనున్నారు. సన్నాలు సాగు చేసే రైతులకు ప్రతి సీజన్‌లో క్వింటాలు ధాన్యానికి 500 రూపాయల బోనస్‌ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ఏడాది యాసంగిలో సాగు చేసిన సన్న రకం ధాన్యానికి ఇప్పటి వరకు బోనస్‌ చెల్లించ లేదు. దీంతో ఈ సీజన్‌లో బోనస్‌ చెల్లిస్తుందా, లేదా అనే అనుమానాలతో ఈసారి దొడ్డు రకం వరి సాగు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులు దొడ్డు రకం వరి పంటను సాగు చేసేందుకు వరి నార్లు పోస్తున్నారు.

Updated Date - Dec 06 , 2025 | 01:21 AM