Share News

వామ్మో జూన్‌..

ABN , Publish Date - May 30 , 2025 | 01:02 AM

పిల్లల చదువులకు తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యం ఇస్తారు.

వామ్మో జూన్‌..

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పిల్లల చదువులకు తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగంతో ఉన్నత స్థితికి చేరాలని ఆర్థికంగా ఎంత భారమైనా భరిస్తారు. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు అప్పులు చేయడానికి కూడా వెనకాడరు. అందుకే జూన్‌ మాసం వచ్చిందంటే వారిలో టెన్షన్‌ మొదలవుతుంది. ఒకటో తారీఖు అంటే ప్రతినెలా సామాన్య కుటుంబాలకు ఇబ్బందిగానే ఉంటున్నా జూన్‌ మాసంలో మాత్రం ఇంకాస్తా భయాన్ని కలిగిస్తుంది. ఇంటి బడ్జెట్‌కు తల్లిదండ్రుల కసరత్తు మొదలైంది. జూన్‌ మాసం వస్తుందంటేనే తల్లిదండ్రులు హడలిపోతారు. ప్రతి కుటుంబంపై జూన్‌ మాసంలో రూ 50 వేల నుంచి రూ లక్ష వరకు బడి ఖర్చులు ఉంటాయి. మరో 15 రోజులు మాత్రమే పాఠశాలలకు సెలవులు మిగిలి ఉన్నాయి. పాఠశాలలు తెరుచుకోవడానికి ముందే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాంలు, షూస్‌ సహా కొనుగోలు చేయడంతో పాటు ఫీజుల మోతను ఎదుర్కోవడానికి తల్లిదండ్రుల్లో దడ మొదలైంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను తలకిందులు చేస్తుంది. కళాశాలలు, పాఠశాలల్లో ఫీజులు కూడా భారీగా పెంచారు. ప్రభుత్వం ఈసారి సకాలంలోనే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందించడానికి చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వశక్తి సంఘాల మహిళల ద్వారా యూనిఫాంలను వేగంగా కుట్టిస్తున్నారు. యూనిఫాంలకు సంబంధించిన బట్ట కూడా సిరిసిల్ల మరమగ్గాలపైనే ఉత్పత్తి అయ్యింది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం కొన్ని దుకాణాల్లో పుస్తకాల అమ్మకాలు మొదలు పెట్టారు. ఈసారి పుస్తకాల ధరలు స్వల్పంగానే పెరిగినా, సామాన్యుడు కొనలేని పరిస్థితి మాత్రం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా పుస్తకాలు అందించినా కానీ వీటికి సంబంధించిన క్వశ్చన్‌ బ్యాంక్‌లు, ఇతర సామగ్రి కొనుగోలుకు మధ్యతరగతి కుటుంబాలు డబ్బులు సమకూర్చుకోవడానికి హడలిపోతున్నారు. స్కూల్‌ ఫీజులు మాట వింటెనే భయపడిపోతున్నారు. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్‌కు వెళ్లే పిల్లలు ఉంటే బంగారం లాంటి వస్తువులు తాకట్టు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు అడ్మిషన్లు, పుస్తకాలు అయిపోతాయంటూ ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న ప్రచారం కూడా అంతాఇంతా కాదు. వేసవి పోయి వాతావరణం చల్లబడుతుందనే సంతోషం కంటే జూన్‌ మాసం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియని పరిస్థితి పేద కుటుంబాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్‌లూం నేత కుటుంబాలు, వ్యవసాయ కుటుంబాలు తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని ఆరాట పడుతున్నారు. ఇందుకోసం ప్రైవేటు విద్యపై మొగ్గు చూపుతుండడంతో మోయలేని భారంగానే మారింది. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో వివిధ రకాల ఫీజుల పేరుతో వసూలు చేస్తూ మానసిక క్షోభకు కూడా గురిచేస్తున్నారు. అయినప్పటికీ పిల్లల తల్లిదండ్రులు పడుతున్న ఆరాటం, ఖర్చుల ఇబ్బందులు చెప్పలేనిది కాదు. ఏ పాఠశాలలో, ఏ కళాశాలలో చేర్పించాలి, ఏ విద్యా సంస్థలకు ఎక్కువ ర్యాంక్‌లు వచ్చాయి, ఎంత ఖర్చు అవుతుంది.. అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఖర్చు భారంగా మారిన పిల్లల భవిష్యత్‌ కోసం వెచ్చించక తప్పదని భావించిన తల్లిదండ్రులు ఖర్చులకు వెనుకాడడం లేదు. సామాన్య, మధ్య తరగతి వారు ప్రైవేటు ఉద్యోగులు ఇందు కోసం కొన్ని నెలల నుంచే తమ ఖర్చులను తగ్గించుకోవడం ఇతర పనుల కోసం డబ్బులను వెచ్చించకుండా వాయిదా వేసుకుంటున్నారు.

ఖర్చుల భారం

ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోవడంతోనే ఫీజులు చెల్లించడం ఒక భారం అయితే.. ఇతర ఖర్చులు ఇబ్బందులకు గురిచేస్తాయి. పిల్లలను పాఠశాలలకు పంపించడానికి యూనిఫాం ఇతర సామగ్రి కొనుగోలు కష్టంగా మారుతోంది. పుస్తకాలు, డ్రెస్‌లు, షూలు, సాధారణ దుస్తుల ఖర్చు, బస్సు ఫీజులు ఇలా అనేక విషయాలను లెక్కలు తల్లిదండ్రులు లెక్కలు వేసుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో బయట నోట్‌ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు కొనుగోలు ఒప్పుకోరు. పాఠ్యపుస్తకాలు, బ్యాడ్జీలు, పాఠశాలల్లోనే కొనుగోలు చేయడంతో కనీసం ఉద్దెర పొందే పరిస్థితి ఉండదు. యజమాన్యాలు నిర్ణయించిన రేటుకు తీసుకోవడం కూడా పిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతి ఇంటికి అదనంగా రూ 50 వేల ఖర్చు

జూన్‌ మాసంలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందటేనే ప్రతి ఇంటిలో ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్‌కు టర్మ్‌ఫీజులు, రవాణా, ఇతర ఖర్చులు కలిపితే రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు అవుతుంది. కార్పొరేట్‌ స్థాయికి వెళ్తే రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి కార్పొరేట్‌ పాఠశాలలు కూడా రావడంతో పిల్లల చదువుల కోసం మధ్య తరగతి కుటుంభాలు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్‌ చదువాలంటే కూడా కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మినహాయించిన కళాశాలల ఫీజులు లక్షల్లోనే ఉన్నాయి. మరోవైపు హాస్టల్‌ ఫీజులు అదనపు భారం ఉంటాయి. ప్రైవేటు పాఠశాలల్లో స్కూల్‌ ఫీజులు వేలల్లో ఉన్నాయి. దీనికి తోడు ఈవెంట్స్‌ పేరుతో అదనపు వసూళ్లు కూడా ఉన్నాయి. పుస్తకాలతో పాటు బ్యాగ్‌లు టిఫిన్‌ బాక్సుల రేట్లు కూడా మండిపోతున్నాయి.

జిల్లాలో 74,626 మంది విద్యార్థులు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 655 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ, జడ్పీహెచ్‌ఎస్‌, కేజీబీవీ, టీఎస్‌ఎంఎస్‌, డీఎన్‌టీ, ఎంపీపీఎస్‌, ఎంపీయూపీఎస్‌, ఎంపీహెచ్‌ఎస్‌, ఆర్బీఎస్‌, తెలంగాణ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 74,626 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ 240, ఎల్‌కేజీలో 435 మంది, యూకేజీలో 670 మంది, 1వ తరగతిలో 7,066 మంది, 2వ తరగతిలో 6,844 మంది, మూడవ తరగతిలో 6,490 మంది, 4వ తరగతిలో 7,569, 5వ తరగతిలో 7,333 మంది, 6వ తరగతిలో 7,913 మంది, 7వ తరగతిలో 7,718 మంది, 8 వ తరగతిలో 7,842 మంది, 9వ తరగతిలో 7,548 మంది, 10వ తరగతిలో 6,908 మంది ఉన్నారు. మండలాల్లో చూస్తే బోయినపల్లిలో 2,708 మంది, చందుర్తిలో 3,048 మంది, ఇల్లంతకుంటలో 4,686 మంది, గంభీరావుపేట 5,701 మంది, కోనరావుపేట 4,533 మంది, ముస్తాబాద్‌లో 5,479 మంది, రుద్రంగిలో 2,622 మంది, సిరిసిల్లలో 16,457 మంది, తంగళ్లపల్లిలో 6,333 మంది, వీర్నపల్లిలో 1,455 మంది, వేములవాడ 12,750 మంది, వేములవాడ రూరల్‌ 1,690 మంది, ఎల్లారెడ్డిపేట 7,169 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు బస్సు, యూనిఫాం, బెల్ట్‌, బ్యాడ్జి, టై, ఐడీ కార్డు, డైరీ, పుస్తకాలు, పెన్నులు, పరీక్ష ఫీజులు.. ఇలా అన్నింటికి వేలల్లోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కేవలం పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు ఇస్తుండగా, మిగతా నోటు బుక్కులు, ఇతర వాటికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.

Updated Date - May 30 , 2025 | 01:02 AM