ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో మహిళలకు గౌరవం
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:09 AM
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం వారికి దక్కిన అసలైన గౌరవమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
భగత్‌నగర్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం వారికి దక్కిన అసలైన గౌరవమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి 6,680 కోట్ల రూపాయలు ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతోమంది ఆర్థిక వెసులుబాటును కల్పించిందన్నారు. ఆర్టీసీ అద్దె బస్సులకు ప్రభుత్వం స్వయం సహాయ సంఘాల మహిళలను యజమానులుగా చేయడం గొప్ప విషయమని తెలిపారు. కరీంనగర్ రీజియన్‌లో మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 4.83 కోట్ల ప్రయాణాలు చేశారని, 201.82 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని తెలిపారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ పోలీసుశాఖ ఆఽధ్వర్యంలో ఆర్టీసీకి కావాల్సిన సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి రాజు మాట్లాడుతూ రీజియన్‌లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు 244 బస్సులు ఉన్నాయని తెలిపారు. పథకం అమలుకు కృషి చేస్తున్న ఆర్టీసీని సిబ్బందిని అభినందించారు. అనంతరం వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆర్టీసీ బస్సులో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, ఆర్టీసీ అధికారులు బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రయాణించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎంలు ఎస్ భూపతిరెడ్డి, పి మల్లేశం, డిపో మేనేజర్ విజయమాధురి, పీవో సత్యనారాయణ, ఏవో శంకరయ్య పాల్గొన్నారు.