Share News

రాజన్న, భీమన్న ఆశీస్సులతో లోకకల్యాణం..

ABN , Publish Date - Oct 12 , 2025 | 12:46 AM

వేములవాడ రాజన్న, భీమన్నల ఆశీస్సులతో లోకకల్యాణం జరగాలని, రాష్ట్ర ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

రాజన్న, భీమన్న ఆశీస్సులతో లోకకల్యాణం..

వేములవాడ కల్చరల్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజన్న, భీమన్నల ఆశీస్సులతో లోకకల్యాణం జరగాలని, రాష్ట్ర ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధిలో భాగంగా శనివారం ఉదయం రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్న ఆలయంలోని ఉత్సవమూర్తులైన పార్వతిరాజరాజేశ్వర స్వామి, శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారలను రాజన్న ఆలయం నుంచి అర్చక పరివారంతో ప్రభుత్వ విప్‌ ఆధ్వర్యంలో ఊరేగింపుగా బీమన్న ఆలయానికి తీసుకువచ్చారు. ఈవోతో కలిసి భీమన్న ఆలయంలో కోడెమొక్కును చెల్లించుకున్నారు. శ్రీభీమేశ్వర, శ్రీనగరేశ్వర స్వామి వారి ఆలయాల్లో ఏర్పాటు చేసిన పలు ఆర్జిత సేవలను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఈవో రమాదేవి, ఆర్డీవో రాధాబాయితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు భీమేశ్వర ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. శృంగేరి పీఠాధిపతుల అనుమతి, సలహాలు, సూచనలు తీసుకుని ఆలయ విస్తరణ చేపడుతున్నామన్నారు. రాజన్న ఆలయంలో జరుగుతున్న పనుల నేపథ్యంలో స్వామి వారికి ఏకాంత సేవలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. శ్రీపార్వతిపరమేశ్వరుల ఉత్సవ మూర్తులను, క్షేత్రపాలకుడు అనంత పద్మనాభస్వామి ఉత్సవమూర్తులను భీమేశ్వర ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఆర్జిత సేవలు కల్పిస్తామన్నారు. రానున్న మరో వంద సంవత్సరాల వరకు భక్తులక ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఈనెల 19వ తేదిన శృంగేరి పీఠాధిపతి విదిశేఖర భారతి శర్మ స్వామి వేములవాడకు రానున్నారని, శ్రీస్వామి వారిని దర్శించుకుని పలు సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, ఏఈవోలు శ్రవణ్‌కుమార్‌, అశోక్‌, శ్రీనివాస్‌, జయకుమారి కాంగ్రెస్‌ నాయకులు రొండి రాజు, కనికరపు రాకేష్‌, సంద్రగిరి శ్రీనివాస్‌, నిత్యానందరావు, నాగం కుమార్‌, పిల్లి కనుక్యయ్య, గాలిపెల్లి స్వామి, పాత సత్యలక్ష్మీ తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో కోడెమొక్కు..

వేములవాడ భీమేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం కోడెమొక్కులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి కోడెమొక్కులను ప్రారంభించారు. పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కోడె మొక్కు చెల్లించుకున్నారు.

Updated Date - Oct 12 , 2025 | 12:46 AM