మావోయిస్టు అధినేతను చంపితే నక్సలిజం పోతుందా..
ABN , Publish Date - May 27 , 2025 | 12:21 AM
మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావును తుదముట్టించడం ద్వారా నక్సలిజం పోతుందని బీజేపీ ప్రభుత్వం భ్రమపడడం దురదృష్టకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు.
సుభాష్‌నగర్, మే 26 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావును తుదముట్టించడం ద్వారా నక్సలిజం పోతుందని బీజేపీ ప్రభుత్వం భ్రమపడడం దురదృష్టకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. సోమవారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి పెట్టుబడిదారుల కొమ్ముకాస్తుందని విమర్శించారు. నక్సలిజం మూలాలను చర్చించి పరిష్కరించకుండా ఎన్‌కౌంటర్ పేరుతో హత్య చేయడం సరికాదన్నారు. అనారోగ్యంతో హాస్పిటల్‌కు వెళ్లిన మావోస్టు నంబాల కేశవరావును కాల్చి చంపడం దురదృష్టకరమన్నారు. చట్టరిత్యా కోర్టులు, జైలుకు పంపించకుండా ఎదురు కాల్పుల పేరుతో కేంద్ర ప్రభుత్వం హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి దేశ సంపదను కార్పోరేట్ శక్తులకు దారదత్తం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంతో అతితక్కువ కాలంలోనే ప్రజావ్యతిరేక మూటకట్టుకుందన్నారు. జిల్లా మహాసభల్లో భవిష్యత్ పోరాటాలను రూపొందించుకుంటాన్నారు. ఈనెల 27, 28 తేదీల్లో నగరంలోని మధు గార్డెన్‌లో నిర్వహించే 23వ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేన శంకర్ హాజరవుతారని తెలిపారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, కొయ్యడ సృజన్‌కుమార్, బోయిని అశోక్, టేకుమల్ల సమ్మయ్య, ఏఐఎస్‌ఎఫ్ కసిరెడ్డి మణికంఠరెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కిన్నెర మల్లమ్మ, కటికరెడ్డి బుచ్చన్న, బ్రాహ్మణపల్లి యుగేందర్, బోనగిరి మహేందర్, మచ్చ రమేశ్, కంది రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.